NTV Telugu Site icon

చిక్కిన చక్కనమ్మ!

Actress Sneha Slim Look Goes Viral

ఇరవై యేళ్ళ క్రితం చిత్రసీమలోకి అడుగుపెట్టిన స్నేహకు ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు. తెలుగుతో పాటు దక్షిణాది చిత్రాలన్నింటిలోనూ నటించేస్తోంది. నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న స్నేహకు ఇద్దరు సంతానం. ఓ గృహిణిగా కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేర్చుతూనే సినిమాల్లోనూ గౌరవప్రదమైన పాత్రలను పోషిస్తోంది. మొన్నటి వరకూ నాయికగా నటించిన స్నేహ ఇప్పుడు అక్క, వదిన పాత్రలకు షిఫ్ట్ అయిపోయింది. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో ఉపేంద్ర సరసన నటించిన స్నేహ… ప్రస్తుతం తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తోంది. దానికి తోటు వాణిజ్య ప్రకటనల్లోనూ మెరిసిపోతోంది. సహజంగా క్యారెక్టర్ ఆర్టిస్టు గా మారిపోయిన ఒకనాటి కథానాయికలు శరీరాకృతికి పెద్దంత ప్రాధాన్యం ఇవ్వరు. కానీ ఆ మధ్య కాస్తంత లావుగా కనిపించిన స్నేహ ఇప్పుడు మాత్రం స్లిమ్ గా మారిపోయింది. తాజాగా ఓ ప్రకటన కోసం ఫోటోలకు ఫోజులిచ్చిన స్నేహ, ఆ స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మీరు ఎంత బలవంతులో మీకు కూడా తెలియదు… ఆ బలం తెలిసొచ్చేంత వరకూ’ అంటూ కామెంట్ పెట్టింది. బహుశా తనలోని విల్ పవర్ ను తెలియచేస్తూనే స్నేహ ఈ మాటలు చెప్పి ఉండొచ్చన్నది నెటిజన్ల అభిప్రాయం.