సీనియర్ నటుడు కార్తీక్ ప్రస్తుతం చెన్నయ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. గురువారం ఉదయం ఇంటిలో వర్కౌట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆయన జారిపడ్డారు. దాంతో కాలు ఎముక విరిగినట్టు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం కూడా అదే చోట కాలు విరగడంతో అప్పట్లో శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడు కూడా హాస్పిటల్ లో చేర్చి ట్రీట్ మెంట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన కార్తీక్ కొంతకాలం రాజకీయపార్టీలు పెట్టి తమిళ జనం నోట నానారు.
Read Also : కొత్త సినిమా మొదలెట్టేసిన నయనతార
అలానే ఆయన కొడుకునూ నటుడిని చేశారు. ఆ మధ్య వరుస పరాజయాలు ఎదురుకావడంతో నటనకు దూరమై, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కూడా హిందీ ‘అంధాధూన్’ తమిళ రీమేక్ ‘అంధగన్’లో కార్తీక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ హీరోగా ఆయన తండ్రి త్యాగరాజన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కార్తీక్ తో పాటు సిమ్రాన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. కార్తీక్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని, అతి త్వరలోనే ఆయన ఇంటికి చేరుకుంటారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.