Abaddhameva Jayathe: భావోద్వేగాలతో ‘అబద్ధమేవ జయతే’ ‘అమ్మ కోసం’ సాంగ్ రిలీజ్!

Amma Kosam

Amma Kosam

భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న వినోదాత్మక చిత్రం ‘అబద్ధమేవ జయతే’. ఈ సినిమాలోని ‘అమ్మ కోసం’ పాటను ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పాట విడుదల అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, “‘అమ్మ కోసం’ పాటలో మంచి భావోద్వేగం ఉంది. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఈ గీతం రూపొందింది. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అబద్ధమేవ జయతే’ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను” అని ప్రశంసించారు. 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి కార్తీక్ కొండ కథ, కథనం అందించి దర్శకత్వం వహిస్తుండగా.. కొండ సందీప్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

గర్భవతిగా ఉన్న తన భార్యకు ఆడపిల్ల పుడితే అది అబద్ధాలు చెప్పిన వారికి శిక్ష అనే నమ్మకంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకుండా జీవితంలో పూర్తి నిజాయితీగా జీవించాలని ప్రయత్నించే ఒక భర్త చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పూర్తిగా నవ్వులు పంచడంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసే చక్కటి సందేశాన్ని కూడా ఈ సినిమా అందించనుంది. ఈ చిత్రంలో బాబు మోహన్, ప్రవణ్య రెడ్డి, సుశాంత్ యాష్కీ, భాను ప్రకాష్, వికాస్, విజయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అమ్మ కోసం’ పాటకు చిత్రబృందం నుంచి విశేష స్పందన లభిస్తుండగా, సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన ఆదరణ దక్కుతుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్‌తో పాటు మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.