AOT Trailer Out: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఓ తార’. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. శ్రుతి హాసన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్బాక్స్ మీడియా, వైజయంతీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవంబర్ 20న తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ఏవోటీ ట్రైలర్ను విడుదల చేసింది. ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలనే కలను ఎలా నెరవేర్చుకుంది?.. ఆ ప్రయాణంలో ఆమె ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ట్రైలర్ను రూపొందించారు. కల్పన అనే అమ్మాయి తన లక్ష్యం కోసం చేసే పోరాటం, ఆమెకు ఎదురయ్యే అడ్డంకులు, ఆ ప్రయాణంలో కృష్ణ అందించే ప్రోత్సాహం ప్రధానంగా కనిపిస్తున్నాయి. ‘కృష్ణ ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తావా? మరి నీ గురించి ఆలోచించవా?’ అనే సంభాషణతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘పది మంది నవ్వితే ఏంటి.. ఒక్కరు నమ్మితే చాలదా కృష్ణా’ అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
చిత్రబృందం ట్రైలర్ను ఆసక్తికరంగా కట్ చేసింది. హృదయానికి హత్తుకునే సంభాషణలు, భావోద్వేగభరితమైన సన్నివేశాలు, మనసుకు హాయినిచ్చే నేపథ్య సంగీతం కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. కల్పన కల, దాన్ని సాధించేందుకు ఆమె చేసే ప్రయత్నాలు, ఎదురయ్యే కష్టాలు.. ఇలా ప్రతి అంశాన్ని దర్శకుడు పవన్ సాదినేని భావోద్వేగభరితంగా చూపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఏవోటీ ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ అమ్మాయి కలను సాకారం చేసుకునే ప్రయాణాన్ని భావోద్వేగాలతో మేళవించి తెరకెక్కించిన ఈ చిత్రం వెండితెరపై ఎలాంటి రిసల్ట్ అందుకుంటుందో చూడాలి.

