NTV Telugu Site icon

Ammalakkalu: 70 ఏళ్ళ ‘అమ్మలక్కలు’

Ammalakkalu

Ammalakkalu

Ammalakkalu:’పాతాళభైరవి’ ఘనవిజయం తరువాత మహానటుడు యన్టీఆర్ జైత్రయాత్ర ఆరంభమైంది. ఆ తరువాత ఆయన చిత్రాలు తెలుగు,తమిళ భాషల్లో రూపొందసాగాయి. 1951లో “పాతాళభైరవి, మల్లీశ్వరి”, తరువాతి సంవత్సరం “పెళ్ళిచేసిచూడు, దాసి, పల్లెటూరు” చిత్రాల ఘనవిజయాలతో యన్టీఆర్ తీరే వేరుగా సాగుతూ ఉండేది. ఆయన తరువాతి చిత్రంగా ‘అమ్మలక్కలు’ రూపొందింది. ఈ సినిమా తమిళంలో ‘మరుమగల్’ పేరుతో ఏకకాలంలో తెరకెక్కింది. రెండు భాషల్లోనూ యన్టీఆర్ కథానాయకుడు. డి.యోగానంద్ దర్శకత్వంలో కృష్ణా పిక్చర్స్ పతాకంపై లెనా చెట్టియార్ ‘అమ్మలక్కలు’ నిర్మించారు. యన్టీఆర్ కు అంతకు ముందే మంచి మిత్రుడైన డి.యోగానంద్ ఈ చిత్రం ద్వారానే దర్శకునిగా పరిచయం కావడం విశేషం. ఈ సినిమా 1953 ఏప్రిల్ 14న విడుదలయింది.

‘అమ్మలక్కలు’ కథ ఏమిటంటే- రామయ్య, కిష్టయ్య మంచి స్నేహితులు. రామయ్యకు ఇద్దరు కొడుకులు సుందర్, కుమార్, కూతురు రూప ఉంటారు. కిష్టయ్యకు ఒకే కూతురు పేరు ఉష. రామయ్య కష్టాల్లో ఉంటే, తన ఇల్లు తాకట్టు పెట్టి, ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకోమంటాడు కిష్టయ్య. దాంతో పట్నం వెళ్ళి వ్యాపారం చేసిన రామయ్యకు లాభాలు వస్తాయి. మిత్రుని అప్పు తీరుస్తాడు. అంతేకాదు తన చిన్నకొడుకు కుమార్ కు, ఉషను ఇచ్చి పెళ్ళిచేయాలని రామయ్య అంటాడు. అందుకు కిష్టయ్య కూడా అంగీకరిస్తాడు. పట్నంలో చదివే కుమార్ ఎక్కడా, పల్లెటూరి అమ్మాయి ఉష ఎక్కడ అంటూ ఊళ్ళోని అమ్మలక్కలు ఆడిపోసుకుంటారు. ఇది విన్న కిష్టయ్య తన కూతురును కూడా పట్నంలో చదివిస్తాడు. కుమార్, ఉష ఒకే చోట చదువుకుంటారు. కాలేజ్ లోనూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ప్రేమించుకుంటారు. పెద్దలు కూడా ఎలాగూ నిశ్చయించారు కదా అని ఆనందంగా ఉంటారు. అయితే వారి కుటుంబాల్లోకి రామయ్య పెద్ద కొడుకు సుందర్ భార్య శాంత రావడంతో కలతలు మొదలవుతాయి. సుందర్ పెళ్ళిలో కిష్టయ్యను అమ్మలక్కలు కొందరు అవమానిస్తారు. దాంతో ఆ ఇంటి ముఖం చూడకూడదని భావిస్తాడు. అయితే కుమార్ వెళ్ళి, ఉషకు నచ్చచెప్పి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఇంట్లో కాపురం చేస్తూ ఆనందంగా ఉండగా, కుమార్ కు పైచదువులకు విదేశాల నుండి పిలుపు వస్తుంది. భార్య ప్రోత్సాహంతో వెళతాడు. కానీ, ఇక్కడ ఉషను అత్త, ఆడపడచు, తోడికోడలు అందరూ మాటలతో హింసిస్తూ ఉంటారు. అన్నిటినీ దిగమింగి అందరికీ తగిన బుద్ధి చెబుతుంది. చివరకు కుమార్ వచ్చాక, అందరినీ నిలదీస్తాడు. కానీ, ఉష మంచితనంతో అందరినీ కలుపుతుంది. అందరూ ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది.

ఇందులో కుమార్ గా యన్టీఆర్, ఉషగా పద్మిని నటించారు. మిగిలిన పాత్రల్లో అమర్ నాథ్, రేలంగి, లలిత, బి.ఆర్.పంతులు, డి.సుబ్రహ్మణ్యం, సూర్యకాంతం, ఋష్యేంద్రమణి, సురభి కమలాబాయి, సురభి బాలసరస్వతి నటించారు. ఈ చిత్రానికి సి.ఆర్.సుబ్బురామన్ సంగీతం సమకూర్చారు. “పెనుగొను మనసుల…”, “కన్నెమావి తోటలోన…”, “మారాడవేల మారాల చిలుక…”, “ఓ నీవే నా ప్రేమా…”, “ఉండాలోయ్…ఉండాలోయ్…” అంటూ సాగే పాటలు అలరించాయి.ఇందులో లలిత, పద్మిని చెల్లెలు అయిన రాగిణి ఓ పాటలో నృత్యంతో అలరించారు. అలా ముగ్గురు అక్కాచెల్లెలు లలిత, పద్మిని, రాగిణి ఈ సినిమాలో కనిపించారు. ఈ సినిమా రెండు భాషల్లోనూ మంచి విజయం సాధించింది. తెలుగులో తమిళం కన్నా మిన్నగా ఆదరణ పొందింది. తెలుగునాట రిపీట్ రన్స్ లోనూ ఆదరణ చూరగొంది.