Christopher Nolan: సత్యజిత్ రేకు క్రిస్టోఫర్ నోలన్ నివాళి.. ‘పథేర్ పాంచాలి’ అబ్బురపరిచిందన్న ఆస్కార్ దర్శకుడు!

Christopher Nolan (2)

Christopher Nolan (2)

Christopher Nolan: ప్రపంచ సినీ చరిత్రలో కొంతమంది దర్శకుల ప్రభావం కాలాన్ని దాటి తరతరాలకు చేరుకుంటుంది. అలాంటి అరుదైన దర్శకుల్లో భారతీయ సినీ దిగ్గజం సత్యజిత్ రే ఒకరు. ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కల్ట్ క్లాసిక్‌లుగా నిలుస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ స్టార్ దర్శకుడు, ఆస్కార్ విజేత క్రిస్టోఫర్ నోలన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సత్యజిత్ రే గొప్పతనాన్ని ప్రపంచానికి గుర్తు చేశాయి. న్యూయార్క్‌లోని ప్రముఖ క్రైటీరియన్ క్లోసెట్ సందర్శించిన సందర్భంగా నోలన్, సత్యజిత్ రే రూపొందించిన ప్రఖ్యాత అపు ట్రైలజీ బాక్స్ సెట్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా రేను భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా అభివర్ణించిన నోలన్ ‘పథేర్ పాంచాలి’ తనను పూర్తిగా అబ్బురపరిచిందని వెల్లడించారు. ఆ సినిమాలో కథనం, ఎమోషన్స్ , రియాలిటీ తనపై చెరగని ముద్ర వేశాయని ఆయన చెప్పారు.

అదే సమయంలో ట్రైలాజీలోని మిగిలిన ‘అపరాజితో’, ‘అపూర్ సంసార్’లను ఇంకా చూడలేదని నోలన్ వెల్లడించారు. అందుకే మొత్తం సెట్ ను ఇంటికి తీసుకెళ్లి పూర్తిగా చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గ్రామీణ బెంగాల్ నేపథ్యంలోని అపు జీవిత ప్రయాణాన్ని చూపించే ఈ మూడు సినిమాలు ప్రపంచ సినీ చరిత్రలో క్లాసిక్‌లుగా గుర్తింపు పొందాయి. ఇప్పడు నోలన్ వ్యాఖ్యలు మరో కారణంతో కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో కొందరు దర్శకుడు ఆదిత్య ధర్ ను సత్యజిత్ రేతో పోలుస్తూ చర్చలు ప్రారంభించారు. ‘ధురందర్’ వంటి సినిమా విజయం తర్వాత వచ్చిన ఈ పోలికలను సినీ అభిమానుల్లో చాలామంది తీవ్రంగా వ్యతిరేకించారు. సత్యజిత్ రేను ఇప్పటి దర్శకులతో పోల్చడం సరైనది కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు.

ఇక సత్యజిత్ రే విషయానికి వస్తే ఆయన గొప్ప కథలు తెరకెక్కించిన దర్శకుడు మాత్రమే కాదు, సమాజంలోని మూఢనమ్మకాలు, కట్టుబాట్లను ప్రశ్నించిన సృజనకర్త కూడా. 1960లో విడుదలైన ‘దేవి’ సినిమాలో మత ఛాందసవాదం ఒక యువతి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన హృదయానికి హత్తుకునేలా చూపించారు. అయితే ఆ సినిమా మతాన్ని కాదు, మూఢనమ్మకాల వల్ల జరిగే నష్టాన్ని మాత్రమే విమర్శిస్తుందని రే స్వయంగా అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. తనకు నచ్చిన కథలను చెప్పే హక్కు ప్రతి దర్శకుడికి ఉందనే అభిప్రాయాన్ని కూడా ఆయన ధైర్యంగా వ్యక్తం చేశారు. ఇప్పుడు  ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ స్వయంగా సత్యజిత్ రే చిత్రాలను కొనుగోలు చేసి, వాటి ప్రభావాన్ని బహిరంగంగా ప్రశంసించడం ఆయన వారసత్వానికి మరో గొప్ప గుర్తింపుగా నిలిచింది. ‘పథేర్ పాంచాలి’ విడుదలై దాదాపు ఏడు దశాబ్దాలు గడిచినా, సత్యజిత్ రే సినిమాలు ఇప్పటికీ ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులను సైతం ప్రేరేపిస్తుండటం ఆయన సృజనాత్మక శక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.