NTV Telugu Site icon

Waltair Veerayya: ఆర్దర్ ఎ విల్సన్ కు చిరు భారీ ప్రశంసలు!

Last Weekend (1)

Last Weekend (1)

Chiranjeevi: ఓ వ్యక్తి నచ్చినా, వారి కళ తనను ఆకట్టుకున్నా… ఎలాంటి భేషజాలకూ పోకుండా మనస్ఫూర్తిగా అభినందించడం మెగాస్టార్ చిరంజీవికి మొదటి నుండి అలవాటు. ఆ ప్రశంసలు అవతలి వారిని మరింత ఉన్న స్థితికి చేర్చుతాయని చిరంజీవి విశ్వసిస్తారు. అదే పని తన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాటోగ్రాఫర్ ఆర్థర్ ఎ విల్సన్ విషయంలోనూ చేశారు చిరంజీవి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విల్సన్ పనితనంతో ఫిదా అయిన మెగాస్టార్ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఏకంగా ఓ లేఖనే రాశారు.

1996లో ‘సుందర పురుషన్’ మూవీతో సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన ఆర్దర్ ఎ విల్సన్ అత్యధికంగా తమిళ సినిమాలకు పనిచేశారు. తెలుగులో ఆయన తొలి చిత్రం ‘భద్ర’. బోయపాటి శ్రీనుతో ఏర్పడిన అనుబంధం కారణంగా ఆ తర్వాత బోయపాటి తెరకెక్కించిన ‘సింహా, దమ్ము, వినయ విధేయ రామ’ చిత్రాలకు ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు. అలానే పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’కూ ఆయనే సినిమాటోగ్రాఫర్. తెలుగులో ఆచితూచి సినిమాలు చేసే ఆర్థన్ ఎ విల్సన్ కు తొలిసారి మెగాస్టార్ తో వర్క్ చేసే అవకాశం ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో లభించింది. అయితే… చిరంజీవి సినిమాకు పని చేసే ఛాన్స్ దొరకడం పట్ల ఆయన ఎంత ఆనంద పడ్డారో తెలియదు కానీ… చిరంజీవి మాత్రం ఆర్థన్ ఎ విల్సన్ అంకిత భావానికి పులకించి పోయారు. ఆ విషయాన్ని తన లేఖలోనూ ప్రస్తావించారు. ‘మీ పనితనం, మీరు చూసే దృష్టి, మీ ఫ్రేమింగ్… వీటన్నింటి కారణంగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా స్థాయి పెరిగింది. మీతో మళ్ళీ మళ్ళీ పనిచేయాలనే భావన నాకు కలిగింది’ అంటూ ప్రశంసించారు.

మంగళవారంతో ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చిత్ర బృందం బిజీగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న రాబోతున్న ఈ సినిమాపై చిరంజీవితో పాటు దర్శక నిర్మాతలూ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఏస్ సినిమాటోగ్రాఫర్ ఆర్థర్ ఎ విల్సన్ పనితనం కూడా ఈ సినిమాను విజువల్ ఫీస్ట్ గా మార్చిందని చిరు చెప్పడంతో ఆ అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి!