NTV Telugu Site icon

Chiranjeevi: LK అద్వానీకి భారతరత్న.. రాజకీయ నాయకుల గౌరవాన్ని పెంచారు

Chiru

Chiru

Chiranjeevi: భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానికి(96) అందజేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఎల్‌కే అద్వానీ జీకి భారతరత్న ఇవ్వనున్నారని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మోదీ చెప్పుకొచ్చారు. ఇక దీంతో ఎల్‌కే అద్వానికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పద్మ విభూషణ్ చిరంజీవి.. ఎల్‌కే అద్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ” ‘భారతరత్న’ నిస్సందేహంగా శ్రీ ఎల్‌కే అద్వానీ జీకి ఎంతో అర్హమైన గౌరవం. మన దేశం చూసిన అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. స్వాతంత్ర్యానికి పూర్వం.. అనేక దశాబ్దాలుగా దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అమూల్యమైనది. అద్వానీ జీ వంటి దిగ్గజాలు రాజకీయాలు, రాజకీయ నాయకుల స్థాయిని, గౌరవాన్ని పెంచారు.. హృదయపూర్వక అభినందనలు ఎల్‌కే అద్వాని జీ” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఎల్‌కే అద్వాని గురించి చెప్పాలంటే ఆయన పూర్తిపేరు లాల్ కృష్ణ అద్వానీ.1970 నుంచి 2019 మధ్య ఎల్‌కే అద్వానీ.. పార్లమెంటు ఉభయసభల్లో సభ్యుడిగా ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టి యావత్ దేశాన్ని ఏకం చేసిన వ్యక్తిగా ఎల్‌కే అద్వానీ చరిత్రలో నిలిచారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశం మొత్తం రథయాత్రను నిర్వహించారు. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయినప్పటికీ అద్వానీ విశేష ప్రజాదరణను పొందారు. కచ్చితంగా ఆయన అత్యన్నుత పురస్కారంకు అర్హుడే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.