స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఇక దానికోసం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్ టైనర్ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేష్ `సన్నికాయిధం`. అనే యాక్షన్ ఎంటర్ టైనర్ లో కూడా నటిస్తున్న విషయం విదితమే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఈ సినిమా తెలుగులో ‘చిన్ని’ అనే పేరుతో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు, తమిళ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘చిన్ని’ చిత్రంలో కీర్తి ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్ పాత్రను పోషించింది.
ఇక ట్రైలర్ విషయానికొస్తే ” సఖినేటి పల్లికి చెందిన ఒక కానిస్టేబుల్ చిన్ని. ఆమెను 24హత్యలు చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆమెకు తోడుగా ఉన్నా రంగయ్య అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తారు. అసలు వీరిద్దరూ ఎవరు..? ఎందుకు ఇన్ని హత్యలు చేయాల్సి వచ్చింది. కానిస్టేబుల్ చిన్నికి జరిగిన అన్యాయం ఏంటి? ఎవరిమీద ఆమె పగ తీర్చుకుంటుంది..? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిన్ని సినిమా. ఆసక్తికరమైన కథా కథనాలతో ట్రైలర్ ని దర్శకుడు కట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ నట విశ్వరూపాన్ని చూడొచ్చన్న విషయం అర్ధమవుతుంది. క్రూరంగా 24 మందిని అత్యంత దారుణంగా చంపి.. ఇంకా కసి తీరని యువతిలా కీర్తి నటన అద్భుతమని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ మొత్తం ఈ రెండు పాత్రలే ఉండడం విశేషం.. ట్రైలర్ తోనే ఎంతో ఆసక్తిని రేపిన చిన్ని.. మే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా కీర్తి విజయాన్ని అందుకొని గట్టెక్కుతుందేమో చూడాలి.
