Site icon NTV Telugu

Chandra Mohan Birthday Special : భలేగా సాగిన చంద్రమోహన్!

Chandra Mohan

Chandra Mohan

‘అంగుళం అదనంగా ఉంటే అందరినీ ఆడించేవాడు’ అంటూ చంద్రమోహన్ ను గురించి ఓ వేదికపై అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అయితేనేమీ ‘మహా గట్టివాడు’ అంటూ కితాబునిచ్చారు. అలా పలు ప్రశంసలు అందుకుంటూనే చంద్రమోహన్ తనదైన అభినయంతో జనాన్ని పరవశింపచేశారు. కొన్ని చిత్రాలలో కథానాయకునిగానూ అలరించారు. అనేక సినిమాలలో అభినయ ప్రాధాన్యమున్న పాత్రల్లో మురిపించారు.

చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. 1945 మే 23న కృష్ణాజిల్లా పమిడిముక్కలలో ఆయన జన్మించారు. చదివింది అగ్రికల్చర్ బి.ఎస్సీ, చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు వేయడంలో దిట్ట. అదే పట్టుతో చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేయకుండా చిత్రసీమవైపు పరుగు తీశారు. ఆరంభంలోనే బి.యన్.రెడ్డి వంటి మేటి దర్శకుని దృష్టిలో పడ్డారు. ఆయనే చంద్రమోహన్ అని నామకరణం చేశారు. బి.యన్. తెరకెక్కించిన ‘రంగులరాట్నం’ చిత్రంలో కథానాయకునిగా పరిచయమైన చంద్రమోహన్, తరువాత తన దరికి చేరిన పాత్రలన్నిటికీ న్యాయం చేయడానికి తపించారు. నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్, కాంతారావు, జగ్గయ్య చిత్రాలలో కీలక పాత్రలు సంపాదించారు చంద్రమోహన్. ఇక తన తరం హీరోలయిన శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు చిత్రాలలోనూ ముఖ్యపాత్రలు ధరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఒకానొక దశలో మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నారు. ఆ సమయంలో ఏడాదికి ఇరవై చిత్రాల్లో నటించి భళా అనిపించారు చంద్రమోహన్.

ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్, చంద్రమోహన్ కు అన్న వరుస అవుతారు. ప్రతిభ లేకుంటే ఏ అన్న కూడా ఆదరించలేడు కదా! అలాగే విశ్వనాథ్ తన చిత్రాల్లో చంద్రమోహన్ కు తగ్గ పాత్రలుంటే తప్పక అతణ్ణే పిలిపించేవారు. విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ నటించిన “సీతామాలక్ష్మి, సిరిసిరిమువ్వ, శంకరాభరణం, శుభోదయం” వంటి చిత్రాలు మంచి పేరు సంపాదించి పెట్టాయి. “ఇంటింటి రామాయణం, పదహారేళ్ళ వయసు, తాయారమ్మ-బంగారయ్య, కోరికలే గుర్రాలయితే, సత్యభామ, పక్కింటి అమ్మాయి, గోపాలరావుగారి అమ్మాయి, పెళ్ళిచూపులు, రాధాకళ్యాణం, మూడుముళ్ళు” మొదలైన చిత్రాల్లోనూ చంద్రమోహన్ హీరోగా నటించి మెప్పించారు. ఆయన సరసన నాయికలుగా నటించిన జయప్రద, జయసుధ, శ్రీదేవి, విజయశాంతి వంటి వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు. అప్పటి నుంచీ కొత్త అమ్మాయిలు చంద్రమోహన్ సరసన నటించడానికి ఉత్సాహం ప్రదర్శించేవారు. ఆయన భార్య జలంధర ప్రముఖ రచయిత్రి. వారికి ఇద్దరు కుమార్తెలు.

తన పర్సనాలిటీకి ఎప్పుడూ హీరో వేషాలే రావన్న సత్యం చంద్రమోహన్ కు తెలుసు. అందుకే ఓ వైపు కథానాయకునిగా నటిస్తూనే మరోవైపు ఇతరుల చిత్రాల్లోనూ కీలక పాత్రలు ధరించేవారు. అదే ఆయన కెరీర్ ను ఇంతకాలం లాక్కువచ్చిందని చెప్పవచ్చు. తరువాతి తరం హీరోల చిత్రాలలో అన్నగా, బావగా, మామగా, తండ్రిగా నటించి మెప్పించిన చంద్రమోహన్ ఇప్పటి యంగ్ హీరోస్ సినిమాల్లో తాతగానూ కనిపిస్తున్నారు. వయసు రీత్యా ఆయన ఈ మధ్య నటనకు దూరంగా జరిగారు. చంద్రమోహన్ మరిన్ని వసంతాలు చూడాలని ఆశిద్దాం.

Exit mobile version