Chandra Bose: “మంచు కొండల్లోన చంద్రమా… చందనాలు చల్లిపో…” అంటూ వచ్చిన చంద్రబోస్ తెలుగువారిపై తన కవితాచందనాలు చల్లుతూనే పున్నమినాటి వెన్నెల విహారాల ఆనందాన్ని అందిస్తున్నారు. తన దరికి చేరిన ఏ అవకాశాన్నైనా ఇట్టే వినియోగించుకోగల చంద్రబోస్ వద్ద ఉన్న పదసంపద అగణితం! “చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని…” అంటూ సృష్టిధర్మం చెబుతారు. “మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది…” అంటూ ప్రకృతిని చూసి నేర్చుకోమనీ బోధిస్తారు. “ట్రెండు మారినా ఫ్రెండు మారడు…” అంటూ ట్రెండ్ కు తగ్గట్టుగా ఫ్రెండ్షిప్ లోని మాధుర్యానీ చాటుతారు; “ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి…” అంటూ ఆవేదనలోనే అమృతాన్నీ కురిపిస్తారు. ఇక ఆ గరత్మంతుడు అమ్మకోసం అమరలోకం నుండి అమృతభాండమే తీసుకు వచ్చిన చందాన “పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ….” అంటూ తెలుగువారందరికీ అమృతం పంచారు చంద్రబోస్… ఇలా అనేక పర్యాయాలు తన పదబంధాలతో జనాన్ని మైమరిపించారు. సందర్భం ఏదైతేనేం చంద్రుడు కదా… సదా వెన్నెలలే కురిపించారు. పేరున చంద్రుడు ఉన్నా, భాస్కరునిలా తరిగిపోని వెలుగు ఈ కవి సొంతం! అలా చంద్రబోస్ తెలుగువారందరి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు. రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’లో కీరవాణి బాణీలకు తగ్గట్టుగా “నాటు…నాటు…” పాట రాసి యావత్ప్రపంచాన్నీ తనవైపు చూసేలా చేసుకున్నారు చంద్రబోస్. ఓ భారతీయ చిత్రం ద్వారా ‘ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ఆస్కార్ అందుకున్న తొలి గీత రచయితగా చంద్రబోస్ చరిత్ర సృష్టించారు. అసలు ఆస్కార్ నామినేషన్ సంపాదించిన దగ్గర నుంచీ “నాటు నాటు…” సంగీతప్రియులను ఆకర్షిస్తూ ‘ఘాటు’ లేపింది. అప్పుడే మన కవిభాస్కరునికి అకాడమీ అందుకునే ఆస్కారముందనీ జనం చాటింపు వేశారు. అందుకు తగ్గట్టుగానే ఈ కవిభాస్కరుడు ‘ఆస్కారు’డుగా జేజేలు అందుకున్నారు.
తన ప్రతి పాటను మొదటి పాటగానే భావించి, ఎంతో భక్తిశ్రద్ధలతో పలికించడం చంద్రబోస్ శైలి. ఈ మధ్య ఓ సీనియర్ రైటర్ చంద్రబోస్ ‘వాల్తేరు వీరయ్య’లో రాసిన టైటిల్ సాంగ్ లో విరుద్ధభావముందని అధిక్షేపించారు. అందుకు చంద్రబోస్ సమయోచితంగా ‘విరోధబాసాలంకారం’ ఎలా వినియోగిస్తారో తనదైన పంథాలో వివరించడమూ అభిమానులను అలరించింది. అలా అని ఈ చంద్రుడు తాను చేసిందే ఒప్పు, ఏ నాటికీ తప్పుకాదని మడికట్టుకొనే రకం కాదు. తప్పయితే తప్పు, ఒకప్పయితే ఒప్పు అని అంగీకరించే మంచిమనసున్నవాడీ చంద్రుడు. ఒకానొక సమయంలో హైదరాబాద్ లో సినీజనం కోరగానే చప్పున పాటలు రాసి ఇచ్చే ఏకైక గీత రచయితగా పేరు సంపాదించారు చంద్రబోస్. ఆ నేపథ్యంలో ఓ దర్శకుడు చంద్రబోస్ పై అభిమానంతో ‘లోకల్ వేటూరి’ అని కీర్తించారు. దానికి అసలైన ‘వేటూరి’ కినుక వహించడమూ జరిగింది. అప్పుడు కూడా చంద్రబోస్ ఎంతో వినమ్రంగా ‘వేటూరి ఆకాశమైతే… మేమంతా ఆయనలోని అణువులం…” అన్నారు. దాంతో వేటూరి సుందరరాముని మది సైతం కరిగింది. ఆశీస్సులు లభించాయి. ఆ పై జనమే ‘మరో వేటూరి’ అంటూ ఈ చంద్రుని అభినందించడమూ జరిగింది. ఇలా జనాభిమానం సంపాదించిన గీత రచయిత నిస్సందేహంగా ఈ మధ్య కాలంలో మరొకరు కానరారు.
ఓ వైపు గీత రచయితగా తీరికలేకున్నా, మరోవైపు కొన్ని టీవీ పాటల కార్యక్రమాలలో న్యాయనిర్ణేతగా కూడా సాగుతూ మరింత వెన్నెల కురిపిస్తూనే ఉన్నారు చంద్రబోస్. నొప్పించక తానొవ్వక అన్న చందాన ఒకప్పుడు చిత్రసీమలో మెప్పిస్తూ తిరిగిన ఘనత సి.నారాయణరెడ్డికే చెల్లింది. ఆ తరువాత అదే తీరున చంద్రబోస్ సాగుతున్నారని సినీజనం మాట! అందుకే తెలుగు సినిమా రంగంలో చంద్రబోస్ అందరివాడు అనిపించుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే పాటలు రాసి అలరిస్తున్నారు. అందరు హీరోల అభిమానుల అభిమానం చూరగొనేలా కలాన్ని పరుగులు తీయిస్తున్నారు. యాభై ఏళ్ళ ప్రాయంలోనూ నవయువ కవిగానే జేజేలు అందుకుంటున్న చంద్రబోస్ వేగాన్ని అందుకొనే వారు ఈ మధ్యకాలంలో కానరారు. వేగం ఉండవచ్చేమో కానీ, జనాన్ని మెప్పిస్తూ సాగే స్పీడు ఈ కవిభాస్కరునికే ఉందనిపిస్తోంది. ఆస్కార్ అందుకున్న తరువాత చంద్రబోస్ ప్రవర్తించిన తీరునూ అందరూ అభినందిస్తున్నారు. తనకు తొలి పాట అందించిన నిర్మాత, దర్శకుడు మొదలు, తన అభివృద్ధిని ఆకాంక్షించిన వారినీ, అభినందిస్తున్నవారినీ కలసి చంద్రబోస్ వారి ఆశీస్సులు అందుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఆ ఆశీస్సుల ఫలంగా ఈ కవిశేఖరుడు మరిన్ని కాలాలు తన కవితలతో అలరిస్తారని ఆశించవచ్చు.