యువతను కిర్రెక్కించేలా బాణీలు కట్టి, భలేగా హిట్లు పట్టారు చక్రి. అప్పట్లో చక్రి స్వరకల్పనతో సక్సెస్ రూటులో సాగాయి పలు చిత్రాలు. పిన్నవయసులోనే కన్నుమూసిన చక్రి సంగీత దర్శకునిగా మాత్రం భలే పేరు సంపాదించారు. అలాగే పలు దానధర్మాలూ చేసి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. చక్రి సంగీతంతో సంబరాలు చేసుకున్న అభిమానులు ఇప్పటికీ ఆయన స్వరవిన్యాసాలు తలచుకుంటూ, ఆయన జయంతిన ఏదో ఒక సేవాకార్యక్రమం నిర్వహిస్తూనే ఉండడం విశేషం!
గిల్లా చక్రధర్ 1974 జూన్ 15న తెలంగాణలోని కంబాలపల్లిలో జన్మించారు. సరిగమలతో సావాసం చేస్తూ, పదనిసలతో పయనించాలని చక్రి బాల్యం నుంచీ తపించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి సహకారంతో కాసింత సంగీతం నేర్చి, ఆ పై సాధనతో పట్టు సాధించారు. ఆరంభంలో ఓ ఆల్బమ్ తయారు చేసి, తన బాణీలు వినండి అంటూ సినిమా రంగంలో తిరగసాగారు చక్రి. అప్పుడు ఈ పోరడు ఏం సంగీతం చేయగలడు అని పెదవి విరిచినవారే అధికం! అయితే ఆ పోరడు బాణీలతో ఆడుకొనే వీరుడు అని కొందరు అభిరుచిగల సినీజనం భావించారు. అలా భావించిన దర్శకుడు పూరి జగన్నాథ్ తన ‘బాచి’ సినిమాతో చక్రిని సంగీత దర్శకునిగా పరిచయం చేశారు. తొలి ప్రయత్నంలోనే చక్రి స్వరాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ఆ తరువాత వరుసగా పూరి జగన్నాథ్ చిత్రాలకు సంగీతం సమకూరుస్తూ ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రముఖ సంగీత దర్శకుడై పోయారు. చక్రి బాణీల్లో ఏదో కొత్తదనం ఉందని భావించిన వారంతా అతని సంగీతం కోసం పరుగులు తీశారు. చక్రి సైతం తన శక్తివంచన లేకుండా జనం మెచ్చే సంగీతం అందిస్తూ అలరించారు. గాయకునిగానూ మురిపించారు.
చక్రి స్వరకల్పలో కొన్ని పాత రాగాలు వినిపిస్తాయనే వారూ లేకపోలేదు. అయితేనేమి నిర్మాతలు, దర్శకులు తనపై పెట్టికున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాణీలు కట్టేవారు. ఆ రోజుల్లో చక్రి ఆడియోలకు కూడా మంచి మార్కెట్ ఉండేది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఆంధ్రావాలా, శివమణి, దేశముదురు” చిత్రాలకు చక్రి సమకూర్చిన సంగీతం యువతను ఉర్రూతలూగించింది.
ఇతర దర్శకులు రూపొందించిన చిత్రాలకు సైతం చక్రి తనదైన బాణీలతో అలరించారు. “అమ్మాయిలు అబ్బాయిలు, సత్యం, వీడే, దేవదాస్, ఢీ, కృష్ణ, మస్కా, సింహా, దేనికైనా రెడీ, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, వెన్నెల్లో హాయ్ హాయ్” వంటి చిత్రాల్లోనూ చక్రి స్వరకేళి జనాన్ని ఆకట్టుకుంది. చక్రి తన అభిమాన సంఘాల ద్వారా పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించేవారు. ఇప్పటికీ ఆయన అభిమానులు అదే పంథాలో పయనిస్తూ ఉండడం విశేషం. 2014 డిసెంబర్ 15న చక్రి తుదిశ్వాస విడిచారు. పిన్నవయసులోనే చక్రి లాంటి ప్రతిభావంతుడు కన్నుమూయడం తెలుగు సినిమాకు తీరని లోటే! అయితే చక్రి పలికించిన బాణీలు ఈ నాటికీ జనాన్ని పులకింప చేస్తూనే ఉండడం విశేషం. ఆయన సంగీతాన్ని తలచుకుంటూనే ఫ్యాన్స్ పరవశించి పోతున్నారు.
