Chiranjeevi: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కామెడీ కి బ్రాండ్ అంబాసిడర్. ఆయన సినిమాలు.. ఆయన ఐకానిక్ క్యారెక్టర్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ పేజీస్ అన్ని బ్రహ్మి మీదనే నడుస్తున్నాయని చెప్పాలి. వారందరికీ బ్రహ్మి గాడ్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక బ్రహ్మి కి హిడెన్ ట్యాలెంట్స్ చాలా ఉన్నాయి. ఆయన ఇంట్లోనే ఉంటూ అందంగా బొమ్మలు వేస్తారు.. కవితలు రాస్తారు. విగ్రహాలను తయారుచేస్తారు. బ్రహ్మి ఎంతోమందికి ఆదర్శం.. మరెంతో మందికి అభిమానం. తన వలన ఒక్కరైనా మారితే సంతోషమని తన ఆత్మకథను తానే రాసుకొని ఒక బుక్ గా ప్రచురించి అందరికీ తన కథను చెప్తున్నారు. ఈ పుస్తకానికి ‘నేను .. మీ బ్రహ్మానందం’ అనే పేరును పెట్టారు. ఈ పుస్తకంలో తన అనుభవాలు, సినిమాలు, అనుభూతులు, జ్ఞాపకాలను అన్ని పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ బుక్ మొదటి కాపీని తన భార్యకు ఇవ్వగా .. ఆ తరువాత చిరంజీవి దంపతులకు అందజేశారు.
ఇక ఈ పుస్తకాన్ని అందుకున్న చిరు దంపతులు బ్రహ్మికి శాలువా కప్పి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని చిరు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో మనకందిచటం ఎంతో ఆనందదాయకం. తానే చెప్పినట్టు ‘ఒకరి అనుభవం,మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు ,మార్గదర్శకము అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తి గా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ పుస్తక ప్రచురణ కర్తలయిన ‘అన్వీక్షికి’ వారిని అభినందిస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ పుస్తకం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం బ్రహ్మి ఫ్యాన్స్.. ఈ పుస్తకాన్నీ ఆర్డర్ పెట్టేయండి.
నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా
తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో
తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన
ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా… pic.twitter.com/O6M8dEFqBZ— Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023
