సక్సెస్ కు ఫార్ములా అనేది ఏదీ ఉండదు అని చెప్పే సినీ ప్రముఖులు చాలామంది ఒకే రకమైన ఫార్ములాను ఫాలో అవుతుంటారు. ఒక నటుడికి ఒక పాత్రలో గుర్తింపు వస్తే ఇక అతనితో అవే పాత్రలు చేయిస్తుంటారు తప్పితే వారికి వేరే పాత్రలు ఇచ్చి, కొత్తగా చూపించే సాహసం చేయరు. అందుకే మనకు పర్మనెంట్ లెక్చరర్స్, పర్మనెంట్ ప్రిన్సిపాల్స్, పర్మనెంట్ పోలీస్ ఆఫీసర్స్, పర్మనెంట్ జడ్జెస్ క్యారెక్టర్స్ కు నటులు ఉన్నారు. ఈ స్టీరియో టైప్ క్యారెక్టర్స్ నుండి పాపం నటీనటులు బయటకు వద్దామని ప్రయత్నించినా మన సోకాల్డ్ దర్శకులు, నిర్మాతలు వారిని ప్రోత్సహించరు. కొత్త టాలెంట్ ను వెతికి పట్టుకోవడానికి, సానబెట్టడానికి వారికి సమయం ఉండదు, ఒక వేళ సమయం ఉన్నా సహనం, సాహసం ఉండవు.
ప్రస్తుతం యాంకరింగ్ లోనూ అదే జరుగుతోంది. అందరికీ స్టార్ యాంకర్ సుమే కావాలి. ఒకవేళ ఆమె డేట్స్ లేవంటే ఎంత పెద్ద హీరో ప్రమోషనల్ ప్రోగ్రామ్ అయినా పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితి ఉంది. వేరొకరితో కార్యక్రమాన్ని జరిపి, తమకున్న ఇమేజ్ ను వాడుకుని దాన్ని సక్సెస్ చేసుకుందామనే ఆలోచన చాలామందిలో ఉండదు. ఇంకేమైనా అంటే ‘రిస్క్ ఎందుకు? సుమ అయితే కార్యక్రమం సజావుగా సాగిపోతుంది కదా!’ అంటూ ఉంటారు. ఇక టీవీ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం అంటే మన స్టార్స్ ముందే ముఖం మాడ్చుకుంటారు. ఛానెల్ లో బాగా పేరున్న టాప్ యాంకర్ తమను ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటారు. కాస్త కొత్త వాళ్ళెవరైనా వచ్చి, ప్రశ్నలు అడగడంలో కొద్దిగా తడబడినా లేదా సినిమాను దాటి అవుటాఫ్ ద బాక్స్ ప్రశ్నలు అడిగినా మన హీరోలకు ఎక్కడలేని అసహనం వచ్చేస్తుంటుంది. చిత్రం ఏమంటే కొంతమంది హీరోలు ఫలానా ప్రశ్నలు అడగొద్దంటూ ముందే పీఆర్వోల ద్వారా చెప్పించేస్తుంటారు. బహుశా ఇలా ప్రతి ఒక్కరికీ చెప్పడం కష్టమని కావచ్చు లేదా కంఫర్ట్ లెవల్ కోసం కావచ్చు….. వాళ్ళే ఒకే యాంకర్ తో ఇంటర్వ్యూ చేసేసి మీడియా ఇస్తున్న రోజులూ వచ్చేశాయి.
చిత్రం ఏమంటే… ఒక్కో సమయంలో ఒక్కో యాంకర్ టర్న్ నడుస్తూ ఉంటుంది. ఒకే యాంకర్ తో సినిమా వాళ్ళంతా ఒక్కోసారి వరుస పెట్టి ఇంటర్వ్యూ చేయించి ఇస్తుంటారు. ప్రతి ఛానెల్ అవే ఇంటర్వ్యూలను ప్రసారం చేయాలి. ఒకే ఇంటర్వ్యూను ప్రతి ఛానెల్ ప్రసారం చేస్తే మజా ఏమంటుందనే కామన్ సెన్స్ కూడా సదరు దర్శక నిర్మాతలకు ఉండదు. దీనికి తోడు కొత్త యాంకర్లతో కాస్తంత కొత్తగా ఇంటర్వ్యూలు చేయిద్దామనీ అనుకోరు. ఒక స్టార్ హీరోని ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తే…. దానికి మైలేజీ వస్తే… ఇక ఆ యాంకర్ వెంటే పడుతుంటారు. విశేషం ఏమంటే… ఇప్పుడు ఆ టైమ్ బిత్తిరి సత్తికి వచ్చింది. మొన్నటి వరకూ వివిధ ఛానెల్స్ లో పనిచేస్తూ వచ్చిన ఆయన ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు వెళ్ళిన తర్వాత తన షోను పక్కన పెట్టి సినిమా వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టాడు. ఇక ఆ ఛానెల్ నుండి బయటకు వచ్చేశాక ఇప్పుడూ అదే పనిని ఫ్రీలాన్స్ యాంకర్ గా చేస్తున్నాడు. బిత్తిరి సత్తి వేషభాషలు కాస్తంత గమ్మత్తుగా ఉండటంతో అతని ఇంటర్వ్యూలను ఆరంభంలో జనం బాగానే ఆదరించారు. ఇప్పుడు వరుసగా మన దర్శక నిర్మాతలు తమ చిత్రాల ఇంటర్వ్యూలను అతనితో చేయించడంతో మొనాటనీగా అనిపిస్తోంది.
‘సర్కారు వారి పాట, జయమ్మ పంచాయితీ, ఎఫ్ 3, అంటే సుందరానికీ’, తాజాగా ‘పక్కా కమర్షియల్’ ఈ సినిమాల ఇంటర్వ్యూలన్నీ బిత్తిరి సత్తితో చేయించే మీడియాకు ఇచ్చారు. వాటిలో మహేశ్ బాబు ఇంటర్వ్యూకు అద్భుతమై స్పందన రావటంతో వరుసగా అతనితోనే ఇంటర్వ్యూలు చేయిస్తున్నారు. మరో గమ్మత్తు ఏమంటే.. తెలుగు భాషే సరిగా అర్థం కాని మన పరభాషా హీరోయిన్లు… బిత్తిరి సత్తి అడిగే ప్రశ్నలకు నవ్వాలో ఏడవాలో తెలియక తికమక పడుతున్నారు. ఈ ఇంటర్వ్యూలు చూసే వారికి మొదట్లో కామెడీగానే అనిపించింది కానీ, వరుసగా అతనే సినిమాల ఇంటర్వ్యూలు చేస్తుండటంతో బోర్ ఫీలవుతున్నారు. ఇది బిత్తిరి సత్తి టాలెంట్ ను తక్కువ చేయటం కాదు కాని తను ఎంత కొత్తదనం చూపించాలని ప్రయత్నిస్తున్నా మొనాటనీ కనిపిస్తూనే ఉంది. అది వివిధ ఛానెల్స్ వాళ్ళు అప్ లోడ్ చేసిన యూట్యూబ్ వ్యూస్ చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. మరి మన దర్శక నిర్మాతలు ఎప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుని, కాస్తంత భిన్నంగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తారో చూడాలి.
