“బిగ్ బాస్-5” ఫైనల్స్ కు సర్వం సిద్ధమవుతోంది. ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న గ్రాండ్ ఫైనల్స్ తో ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. గంటల వ్యవధిలో వెంటవెంటనే ప్రోమోలు విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున ఎప్పటిలాగే వీక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచేస్తూ “వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే” అంటూ స్టార్ట్ చేశారు. ఇక హౌస్ మేట్స్ తో “టునైట్ మీరు స్టార్స్ కానీ… మీరు చాలామంది స్టార్స్ ని చూడబోతున్నారు” అని చెప్పగా, హౌజ్ లోకి ఈరోజే రాత్రి ఎవరెవరు గెస్టులుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే విషయంపై ప్రోమోలో క్లారిటీ ఇచ్చేశారు. ‘బ్రహ్మాస్త్ర’ టీంతో కలిసి రాజమౌళి, ‘పుష్ప’ టీం, ‘శ్యామ్ సింగ రాయ్’ బృందం, ‘పరంపర’ మూవీ స్టార్స్ చేసిన సందడితో ‘బిగ్ బాస్-5’ వేదిక అదిరిపోయిందని చెప్పాలి.
Read Also :
ముందుగా రాజమౌళి, అలియా భట్, రణబీర్ కపూర్, జగపతి బాబు, నవీన్ చంద్ర, సుకుమార్, రష్మిక మందన్న, దేవి శ్రీ ప్రసాద్, కృతి శెట్టి, సాయి పల్లవి, నాని తదితరులు అతిథులుగా విచ్చేశారు. అలియా భట్ ‘దబిడిదిబిడే’ అంటూ బాలయ్య డైలాగ్ చెప్పగా, రష్మిక ‘సామి సామీ’ స్టెప్పుతో అదరగొట్టేసింది. నాగార్జున ఆ స్టెప్పు సుకుమార్ తో వేయిస్తే ఎలా ఉంటుందని అడగడం హిలేరియస్. రాహుల్ సింప్లిగంజ్ ‘నాటు నాటు’ సాంగ్ ను పాడగా, దానికి యాని మాస్టర్, నటరాజ్ మాస్టర్ కలిసి ఊర నాటు స్టెప్పు వేయడం కూడా ప్రోమోలో కన్పించింది. ఇక హౌజ్ మేట్స్ తో రాజమౌళి ఫన్, ‘శ్యామ్ సింగ రాయ్’ బ్యూటీలతో నాగార్జున పంచులు, శ్రియ స్పెషల్ డ్యాన్స్, ‘ఊ అంటావా’ సాంగ్ కు హీరోయిన్ అదిరిపోయే డ్యాన్స్, ఇంకా మాజీ హౌజ్ మేట్స్ తో పాటు గత సీజన్ల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసే రచ్చ ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమో ఎఫెక్ట్ తో ఈరోజు రాత్రి ‘బిగ్ బాస్-5’ టీఆర్పీ రేటింగ్ టాప్ లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 5 మచ్ బిగ్గర్ ఎంటర్టైన్మెంట్ అందించనుంది.
