NTV Telugu Site icon

Big Breaking: శరత్ బాబు కన్నుమూత!

Sharath Babu

Sharath Babu

గత కొంతకాలంగా హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్న ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. నటుడు శరత్ బాబు జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస. తండ్రి విజయశంకర దీక్షితులు, తల్లి సుశీలాదేవి. మొత్తం పదమూడు మంది సంతానం. ఎనిమిది మంది అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్ళు. జూలై 31, 1951న ఆయన జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సత్యం బాబు దీక్షితులు. అయతే ముద్దుగా శరత్ బాబును ‘సత్యంబాబు’ అని పిలిచే వారు. పి.యు.సి. ఆముదాల వలసలో పూర్తి చేసిన శరత్ బాబు బిఎస్సీ శ్రీకాకుళం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివారు. యుక్తవయసులోనే పలు నాటకాలు ఆడారు శరత్ బాబు. ప్రముఖ నాటక రచయిత భమిడిపాటి రాధాకృష్ణ రాసిన ‘దొంగాటకం’, గొల్లపూడి మారుతీరావు రాసిన ‘రెండురెళ్ళుఆరు’ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నటుడిగా తన అదృష్టం పరీక్షించుకోవడానికి ముందు ఆముదాల వలసలో తన అన్నయ్యతో కలిసి శరత్ బాబు ‘గౌరీశంకర్’ అనే హోటల్ ను నడిపారు. ఆయన తండ్రి రైల్వే హోటల్ కాంట్రాక్ట్ తీసుకుని దానిని నిర్వహించేవారు. మొదట్లో పోలీస్ ఆఫీసర్ కావాలన్నది శరత్ బాబు కోరిక అయినా… అందరూ అందంగా ఉంటావు, నాటకాలు వేస్తున్నావ్, సినిమాలో ప్రయత్నించొచ్చు కదా అనడంతో శరత్ బాబు చెన్నయ్ చేరుకున్నారు.

సినిమా ట్విస్టులను తలపించే శరత్ బాబు జీవితం!
ఆదుర్తి సుబ్బారావు అభిమాని అయిన శరత్ బాబు ఆయన బ్యానర్ లో సినిమాలు చేయాలని ప్రయత్నించారు కానీ అది సాధ్యం కాలేదు. చెన్నయ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో స్నేహితుడు ప్రభాకర్ సహకారం, ప్రోత్సాహంతో ‘రామరాజ్యం’ చిత్రంలో హీరోగా అవకాశాన్ని అందుకున్నారు. చంద్రకళ హీరోయిన్ కాగా ఎస్వీ రంగారావు ఆమె తండ్రిగా, జగ్గయ్య, మహానటి సావిత్రి శరత్ బాబు అన్నయ్య, వదినలుగా నటించారు. రోజారమణి, చంద్రమోహన్‌ సైతం ఈ సినిమాలో నటించారు. బాబూరావు దర్శకత్వంలో ప్రభాకర్ ఈ సినిమా నిర్మించారు. 1973లో ఈ సినిమా విడుదలైంది. 1974లో వచ్చిన ‘నోము’లో శరత్ బాబు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. అది విజయవంతం కావడంతో మంచి గుర్తింపు లభించింది. కృష్ణ, వాణిశ్రీ నటించిన ‘అభిమానవతి’లోనూ శరత్ బాబు నెగెటివ్ టచ్ ఉన్న పాత్రనే చేశారు. ఇక బాలచందర్ దర్శకత్వంలో శరత్ బాబు నటించిన ‘నిళిల్ నిజమా గిరదు’ మంచి విజయం సాధించింది. ఇందులో కమల్ హాసన్, అనంత్ తో కలిసి శరత్ బాబు నటించారు. అదే సమయంలో తెలుగులో వచ్చిన ‘ఇది కథకాదు’, ‘గుప్పెడు మనసు’ చిత్రాలతో శరత్ బాబు ఫామ్ లోకి వచ్చేశారు. అక్కడ నుండి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో వరుసగా అవకాశాలు రావడం మొదలైంది. అలానే హిందీతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలలతోనూ శరత్ బాబు నటించారు. భారతీరాజా ‘సీతాకోక చిలుక’, కె. విశ్వనాథ్ ‘సాగర సంగమం, స్వాతిముత్యం’, బాపు ‘రాధాకళ్యాణం, పెళ్ళీడు పిల్లలు’, వంశీ ‘సితార, అన్వేషణ’, క్రాంతి కుమార్ ‘స్వాతి, స్రవంతి’ చిత్రాలు శరత్ బాబును నటుడిగా మరో మెట్టు పైకి తీసుకెళ్ళాయి. నటుడు కాంతారావు నిర్మించిన ‘స్వాతిచినుకులు’ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక చిత్రాలలో నటించిన ఘనత శరత్ బాబుకు దక్కుతుంది. ‘తోడు, మగధీర, అయ్యప్పస్వామి మహాత్మ్యం’ వంటి చిత్రాలలోనూ భిన్నమైన పాత్రలు పోషించారు. త్వరలో విడుదల కాబోతున్న నరేశ్, పవిత్రాలోకేష్ ‘మళ్ళీ పెళ్ళి’ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ పాత్రను శరత్ బాబు పోషించారు. ఆయన బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మూడు సార్లు నంది అవార్డును అందుకున్నారు. అలానే తమిళనాడు ప్రభుత్వ అవార్డుతో పాటు ప్రైవేట్ సంస్థల పురస్కారాలు పొందారు. రమాప్రభను వివాహం చేసుకున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘గాంధీనగర్ రెండో వీధి’ సినిమాకు శరత్ బాబు సమర్పకుడిగా వ్యవహరించారు.

వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైన కూడా శరత్ బాబు తన సత్తాచాటారు. ‘అంతరంగాలు’ సీరియల్ ఆయనకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. రమాప్రభతో వివాహం, అనంతం విడాకులు శరత్ బాబు జీవితంలో ఓ చీకటి అధ్యాయం. అనంతరం ఆయన తమిళ నటుడు ఎం.ఎన్. నంబియార్ కుమార్తె స్నేహాలత ను 1990లో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇది రెండో పెళ్లి. అయితే రెండు దశాబ్దాల తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. శరత్ బాబు రాజకీయాలలోనూ కొంతకాలం చురుకుగా ఉన్నారు.