Site icon NTV Telugu

Monthly Report: ఫిబ్రవరిలో దంచికొట్టిన లా… లా… భీమ్లా!

pawan kalyan

pawan kalyan

ఫిబ్రవరి నెలలో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో సినిమా థియేటర్ల ఆక్యుపెన్సీని నూరు శాతానికి పెంచారు. వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలనూ తొలగించారు. దాంతో పాన్ ఇండియా సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అజిత్ తమిళ చిత్రం ‘వలిమై’, అలియాభట్ హిందీ మూవీ ‘గంగూబాయ్ కఠియావాడి’ వంటివి పలు భాషల్లో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది .

తెలుగు సినిమాల విషయానికి వస్తే… ఫిబ్రవరి మాసంలో అనువాదాలతో కలిపి ఏకంగా 30 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. అందులో 21 స్ట్రయిట్ మూవీస్ కాగా 9 వివిధ భాషల డబ్బింగ్ చిత్రాలు. ఫిబ్రవరి ఫస్ట్ వీకెండ్ లో శ్రీకాంత్ ‘కోతల రాయుడు’, యండమూరి డైరెక్ట్ చేసిన ‘అతడు ఆమె ప్రియుడు’, ‘పటారుపాళెం ప్రేమకథ’, ‘స్వ’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అలానే విశాల్ ‘సామాన్యుడు’, కన్నడ చిత్రం ‘రియల్ దండుపాళ్యం’ కూడా విడుదలైంది. ఇవేవీ బాక్సాఫీస్ బరిలో సత్తాను చాటలేకపోయాయి.

ఆ తర్వాత వారం విక్రమ్ తమిళ చిత్రం ‘మహాన్’ ఓటీటీలో విడుదలైంది. కానీ వీక్షకులను మెప్పించలేకపోయింది. అదే వీకెండ్ లో ప్రియమణి ‘భామా కలాపం’, సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి కానీ పెద్దంత ప్రభావం చూపలేదు. ఇక 11వ తేదీన థియేటర్లలోకి రవితేజ ‘ఖిలాడీ’, ‘సెహరి, రచ్చ రచ్చ’ చిత్రాలు వచ్చాయి. భారీ అంచనాలతో తెరకెక్కిన ‘ఖిలాడీ’ని నిర్మాతలు హిందీలోకీ డబ్ చేశారు. ఇక్కడ, అక్కడ కూడా ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. చిత్రంగా… పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన సిద్ధూ జొన్నలగడ్డో ‘డీజే టిల్లు’ సినిమా ఫిబ్రవరి 12న విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది. పెద్ద సినిమాల విడుదల కోసం ఈ నెలాఖరులో ‘డీజే టిల్లు’ షోస్ ఆపేసిన ఎగ్జిబిటర్స్ మళ్ళీ ఇప్పుడు ప్రదర్శనకు సిద్ధమౌతుండటం విశేషం.

ఈ నెల 18వ తేదీ రెండు అనువాద చిత్రాలతో కలిపి ఏకంగా 12 సినిమాలు విడులయ్యాయి. అందులో మోహన్ బాబు ‘సన్నాఫ్‌ ఇండియా’ కూడా ఉంది. అయితే మోహన్ బాబు అండ్ టీమ్ చేసిన ఈ ప్రయోగం విఫలమైంది. ‘వర్జిన్ స్టోరీ, సురభి 70 ఎం.ఎం., బ్యాచ్ -1, నీకు నాకు పెళ్ళంట, స్వాతి చినుకు సంధ్య వేళలో, రోమన్, 2020 గోల్ మాల్‌, అన్ చార్టెడ్, బడవ రాస్కెల్’ చిత్రాలు పేలవమైన ఫలితాలు సాధించాయి. 19వ తేదీ వచ్చిన ‘నేనే నక్షత్ర’ సినిమాదీ అదే పరిస్థితి.

ఈ నెల లాస్ట్ వీకెండ్ లో థియేటర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, రానా మూవీ ‘భీమ్లా నాయక్’ కారణంగా కళకళ లాడాయి. ఏపీలోనూ నూరు శాతం ఆక్యుపెన్సీ ఉండటం, రాత్రి కర్ఫ్యూ ఎత్తివేయడంతో ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ 25న మూవీని గ్రాండ్ గా విడుదల చేశారు. తెలంగాణలో మంచి కలెక్షన్లు ఈ చిత్రానికి వచ్చినా, ఏపీలో టిక్కెట్ రేట్స్ తక్కువ ఉండటంతో ఆ ప్రభావం గ్రాస్ పై భారీగానే పడింది. అయినా ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైల్డ్ ఈ మూవీ 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ఒకరోజు ముందు వచ్చిన అజిత్ ‘వలిమై’కు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో విడుదలైంది. టాక్ ప్రతికూలంగా ఉండటంతో ఏకం 18 నిమిషాలు ట్రిమ్ చేశారు. అయితే వరల్డ్ వైడ్ ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి వంద కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’తో పాటే వచ్చిన మరో సినిమా ‘గంగూబాయ్ కఠియావాడి’ హిందీతో పాటు తెలుగులోనూ డబ్ అయ్యింది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించినా, బాక్సాఫీస్ లో మాత్రం ఏమంత మెరుగైన కలెక్షన్లు దక్కలేదు. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ దాదాపు 40 కోట్ల గ్రాస్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సింగిల్ లాంగ్వేజ్ లో, తక్కువ రేట్లతో ప్రదర్శితమైనా ‘భీమ్లా నాయక్’ మంచి కలెక్షన్లను పొంది… ఈ నెల విన్నర్ గా నిలిచిందనే చెప్పాలి.

Exit mobile version