NTV Telugu Site icon

Bharathiraja: విలక్షణంగా సాగిన భారతీరాజా

Bharathi Raaj

Bharathi Raaj

వైవిధ్యానికి మారుపేరుగా నిలిచారు ప్రముఖ దర్శకుడు భారతీరాజా. ఒకప్పుడు భారతీరాజా సినిమా వస్తోందంటే చాలు వైవిధ్యానికి జై కొట్టేవారందరూ థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. వారి అభిరుచికి తగ్గట్టుగానే భారతీరాజా సినిమాలు రూపొందేవి. దర్శకునిగానే కాదు, నటునిగానూ కొన్ని చిత్రాలలో అలరించారు భారతీరాజా.

భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి. ఆయన 1941 జూలై 17న తమిళనాడులోని తేని అల్లినగరంలో జన్మించారు. బాల్యం నుంచీ భారతీరాజా కళల పట్ల ఆకర్షితుడై సినిమా రంగంలో తన ఉనికిని చాటుకోవాలని తపించేవారు. దాంతో మదరాసుకు చేరి చిత్రసీమలో చేరేందుకు పలు పాట్లు పడ్డారు. అప్పట్లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమా రంగాలన్నిటికీ కేంద్రం మదరాసు. దాంతో తొలుత కన్నడ దర్శకుడు పుట్టన్న కణగల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గాచేరారు. తరువాత తెలుగు దర్శకులు పి.పుల్లయ్య వద్ద కొన్ని చిత్రాలకు పనిచేశారు. మళయాళ దర్శకుడు ఎమ్.కృష్ణన్ నాయర్ దగ్గర, తమిళ దర్శకుడు ఎ.జగన్నాథన్ చిత్రాలకూ అసోసియేట్ గా, కో-డైరెక్టర్ గా ఉన్నారు భారతీరాజా. నాలుగు భాషల దర్శకుల వద్ద పనిచేయడంతో భారతీరాజాకు దర్శకత్వంపై మంచి పట్టు లభించింది. తన ఊరికి సమీపంలోని వారే అయిన ఇళయరాజా, వారి సోదరులను కూడా చిత్రసీమలో అడుగు పెట్టేలా చేయడానికి భారతీరాజా ఎంతగానో సహకరించారు. ఇక భారతీరాజా తాను తీసే చిత్రం రెగ్యులర్ మూవీస్ కు భిన్నంగా ఉండాలని ఎప్పుడూ తపించేవారు. ఆ తపనతోనే పల్లెవాతావరణం నేపథ్యంలో ‘పదునారు వయదినిలే’ రూపొందించారు. ఆ చిత్రం సాధించిన ఘనవిజయంతో భారతీరాజా వైవిధ్యం కోసం సినీజనం పరుగులు తీశారు. భారతీరాజా రెండో చిత్రం ‘కిళక్కే పోగుం రైల్’ ఈ చిత్రం ద్వారా రాధికను నాయికగా పరిచయం చేశారు. ఇందులో మన తెలుగు నటుడు సుధాకర్ (తరువాత తెలుగులో ఫేమస్ కమెడియన్ గా మారారు) హీరోగా నటించారు. ఈ సినిమా మరింత విజయం సాధించింది. సుధాకర్ కు తమిళనాట స్టార్ హీరోగా మారడానికి కారణమయింది. మూడో చిత్రం ‘సిగప్పు రోజాక్కల్’. ఇది సంచలన విజయం సాధించింది. కమల్, శ్రీదేవి నటించిన ఈ చిత్రం తెలుగులో ‘ఎర్ర గులాబీలు’గా అనువాదమై, ఇక్కడా విజయం సాధించింది. నాల్గవ చిత్రంగా ’16 వయదినిలే’ను హిందీలో ‘సోల్వా సావన్’గా తెరకెక్కించారు భారతీరాజా. ఈ సినిమాతోనే శ్రీదేవి హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది. ‘సోల్వా సావన్’ అంతగా అలరించలేకపోయింది.

భారతీరాజా తెరకెక్కించిన ‘పుదియ వార్పుగల్’లో ఆయన శిష్యుడు భాగ్యరాజ్ హీరోగా నటించగా, రతి అగ్నిహోత్రి నాయిక. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇదే కథను భారతీరాజా తెలుగులో ‘కొత్త జీవితాలు’ పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో ఇదే ఆయనకు తొలి చిత్రం. ఈ సినిమా ద్వారా సుహాసిని తెలుగు చిత్రసీమకు పరిచయమయింది. ‘అలైగల్ ఒయివదిల్లై’ చిత్రం ద్వారా రాధను నాయికగా పరిచయం చేశారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఇదే చిత్రం తెలుగులో భారతీరాజా దర్శకత్వంలోనే ‘సీతాకోకచిలుక’గా రూపొందింది. ఈ సినిమా ద్వారా ముచ్చెర్ల అరుణ నాయికగా పరిచయమయింది. తెలుగులో కార్తిక్ కు ఇదే తొలి చిత్రం. ఇక భారతీరాజా రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘టిక్ టిక్ టిక్’ కూడా అప్పటి యువతరాన్ని ఆకట్టుకుంది. తెలుగులో “యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు” వంటి చిత్రాలు రూపొందించారు. అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కృష్ణతో ‘జమదగ్ని’, చిరంజీవితో ‘ఆరాధన’ రూపొందించారు భారతీరాజా. ఇవి కూడా ఆట్టే అలరించలేకపోయాయి. ఆ తరువాత ఆయన మళ్ళీ తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించలేదు. అయితే భారతీరాజా రూపొందించిన చిత్రాలు తెలుగులో అనువాదమై అలరిస్తూ ఉండేవి.

భారతీరాజా ‘కిళక్కే పోగుం రైల్’ను తెలుగులో బాపు దర్శకత్వంలో ‘తూర్పు వెళ్ళే రైలు’గా రూపొందించారు. శివాజీగణేశన్, రాధతో భారతీరాజా రూపొందించిన ‘ముదల్ మారియాదై’ తమిళనాట మంచి విజయం సాధించింది. తెలుగులో ‘ఆత్మబంధువు’గా అనువాదమై ఇక్కడా విజయకేతనం ఎగురవేసింది. భారతీరాజా ‘మన్ వాసనై’ చిత్రం తెలుగులో బాలకృష్ణ హీరోగా ‘మంగమ్మగారి మనవడు’గా రూపొందింది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! శిష్యుడు భాగ్యరాజ్ అందించిన ‘ఒరు ఖైదియన్ డైరీ’ స్టోరీతో భారతీరాజా తీసిన చిత్రం మంచి విజయం సాధించింది. కమల్ నటించిన ఈ చిత్రం తెలుగులో ‘ఖైదీ వేట’గా వచ్చి అలరించింది. ఇదే చిత్రాన్ని హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా భాగ్యరాజా దర్శకత్వంలో మన తెలుగు నిర్మాత ఎ.పూర్ణచంద్రరావు ‘ఆఖరీ రాస్తా’గా నిర్మించి, విజయం సాధించారు. ఇక భారతీరాజా తెరకెక్కించిన ‘కరుతమ్మ’ మంచి విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా మహేశ్వరి పరిచయమయింది. తన చిత్రాల ద్వారా ఎందరికో సినీజీవితం ప్రసాదించారు భారతీరాజా.
2013లో ఆయన తెరకెక్కించిన ‘అన్నకోడి’ అంతగా అలరించలేకపోయింది. దాంతో దాదాపు ఏడేళ్ళు మెగాఫోన్ పట్టలేదు భారతీరాజా. 2020లో ఆయన రూపొందించిన ‘మీండుమ్ ఒరు మరియాదై’ కూడా ఆకట్టుకోలేదు. ఇందులో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. అంతకు ముందు కొన్ని చిత్రాలలో అతిథిగా కనిపించిన భారతీరాజా, మణిరత్నం తెరకెక్కించిన ‘యువ’ సినిమా ద్వారా నటునిగా మారారు. తరువాత పలు చిత్రాలలో నటించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలను ధరించడానికి ఆయన ఉత్సాహంగానే ఉన్నారు. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.