తమిళ నటుడు భాగ్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. ఓ పుస్తకావిష్కరణల్లో భాగంగా బీజేపీ మనిషిని కాదంటూనే మోడీని విమర్శించే వాళ్ళు నెల తక్కువ వాళ్ళు అంటూ కామెంట్స్ చేయడం వివాదానికి దారి తీసింది. దీంతో తాజాగా సారీ చెబుతూ తన వ్యాఖ్యలకు మళ్ళీ వివరణ ఇచ్చుకున్నారు భాగ్యరాజ్.
Read Also : Akshay Kumar : పాన్ మసాలా యాడ్ సెగ… సారీ చెప్పి తప్పుకున్న హీరో
చెన్నైలోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘న్యూ ఇండియా 22 : పీఎం మోదీ సంక్షేమ విధానాలు’ పుస్తకావిష్కరణ సందర్భంగా భాగ్యరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై హాజరైన ఈ కార్యక్రమంలో భాగ్యరాజ్ మాట్లాడుతూ “మోదీ జీ తన విమర్శకులను మూడు నెలల వయస్సులో నెలలు నిండకుండా జన్మించిన వారిగా పరిగణించాలి. నాల్గవ నెలలో మాత్రమే నోరు ఏర్పడుతుంది. ఐదవ నెలలో చెవులు ఏర్పడతాయి. వాళ్లు మూడో నెలలో పుట్టారని నేను చెప్పడానికి కారణం… ఎదుటివాళ్లు చెప్పేది వినరు. మేము దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అంటూ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై వికలాంగ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో భాగ్యరాజ్ సాయంత్రానికే క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. “నా ‘ప్రీమెచ్యూర్ బేబీస్’ కామెంట్ తప్పుగా బయటకు వెళ్లిందని నేను అర్థం చేసుకున్నాను. వికలాంగులను బాధ పెట్టాలని నా ఉద్దేశ్యం కాదు. నా కామెంట్స్ తో బాధపడిన వారికి క్షమాపణలు చెబుతున్నాను” అని అన్నారు.
