Site icon NTV Telugu

Heroine Jamuna: ఆ నాటి అందాల అభినేత్రి జమున!

Jamuna Actress

Jamuna Actress

Beautiful actress Jamuna passed away: నటి జమున పేరు వినగానే ఆ నాటి ఆమె అందాలరూపాన్నే ఊహించుకొనే అభిమానులు ఎందరో ఉన్నారు. తెలుగు చిత్రసీమలో ఎక్కువ కాలం నాయికగా నటించిన ఘనతను జమున సొంతం చేసుకున్నారు. తనకంటే వయసులో చిన్నవారి సరసన సైతం హీరోయిన్ గా నటించి మెప్పించారామె. ఇక నాటి మేటి నటులతో జమున తనదైన బాణీ పలికిస్తూ నటించిన తీరును అభిమానులు ఇప్పటికీ మననం చేసుకొని ఆనందిస్తూ ఉంటారు. సత్యభామగా తెరపై ఆమె అభినయించిన తీరు అనితరసాధ్యంగా నిలచింది. ఆమె చిత్రాల ద్వారా పలువురు హీరోలు తమ భవితకు బంగారు బాటలు వేసుకోవడం గమనార్హం!

జమున అసలు పేరు జానా బాయి. కర్ణాటకలోని హంపిలో జన్మించినా, గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పెరిగారు. అదే సమయంలో సావిత్రి సైతం నాటకాలు వేసేవారు. ఓ సారి అనుకోకుండా దుగ్గిరాలలో సావిత్రి ప్రదర్శన ఇచ్చే సమయంలో జమున వారి ఇంటిలోనే దిగారు. అలా చిత్రసీమకు ముందే సావిత్రిని ‘అక్కా’ అని పిలుస్తూ సాగారు. సావిత్రి స్ఫూర్తితో జమున సైతం నాటకాల్లో నటించడం మొదలెట్టారు. ఆ సమయంలో ప్రఖ్యాత నటులు జగ్గయ్య వీరిద్దరికీ నాటకాల్లో అవకాశాలు కల్పిస్తూ, వాటికి దర్శకత్వం వహించేవారు. డాక్టర్ గరికపాటి రాజారావు ‘పుట్టిల్లు’ చిత్రం ద్వారా జమునను చిత్రసీమకు పరిచయం చేశారు. తొలి చిత్రంలోనే నటిగా మంచి మార్కులు సంపాదించారు జమున.

Read also: BRS Party: నేడు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ లోకి గిరిధర్‌ గమాంగ్‌..

జమున నటించిన “దొంగరాముడు, మిస్సమ్మ, చిరంజీవులు, ముద్దుబిడ్డ, భాగ్యరేఖ, భూకైలాస్, ఇల్లరికం, గులేబకావళి కథ, గుండమ్మకథ, బొబ్బిలియుద్ధం, మంచి మనిషి, మూగమనసులు, రాముడు-భీముడు, మంగమ్మ శపథం, దొరికితే దొంగలు, తోడు-నీడ, పూలరంగడు, రాము, మట్టిలో మాణిక్యం, పండంటి కాపురం, తాసిల్లార్ గారి అమ్మాయి, సంసారం, మనుషులంతా ఒక్కటే, ఉండమ్మా బొట్టు పెడతా” వంటి చిత్రాలు జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరికీ హిట్ పెయిర్ గా సాగారు. ‘ఉండమ్మా బొట్టు పెడతా’ చిత్రంలో కృష్ణ సరసన నటించారు. ఆ సినిమాతో కృష్ణకు ఫ్యామిలీ ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు లభించింది. ఇక స్టార్ డమ్ కోసం దాదాపు పుష్కరకాలంగా తపిస్తోన్న శోభన్ బాబుకు జమునతో నటించిన ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ బ్రేక్ నిచ్చింది. అలాగే హరనాథ్ కు జమునతో నటించిన చిత్రాలే హీరోగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. కృష్ణంరాజును రెబల్ స్టార్ గా నిలిపిన ‘కటకటాల రుద్రయ్య’లో జమున కృష్ణంరాజుకు జోడీగా, తల్లిగా నటించారు. ఇలా అనేకమంది స్టార్ హీరోస్ కు విజయనాయికగా అలరించారు జమున.

తెలుగులో జమునతో రూపొందిన అనేక చిత్రాలు తమిళంలో రీమేక్ అయినప్పుడూ ఆ పాత్రల్లో ఆమెనే ఎంపిక చేసుకొనేవారు. అలాగే హిందీలోనూ జమున ” మిస్ మేరీ, మిలన్, హమ్ రాహీ, దుల్హన్” వంటి చిత్రాలలో నటించారు. కొన్ని కన్నడ చిత్రాలలోనూ జమున నటించి మెప్పించారు. జమున, ప్రొఫెసర్ జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు. వారికి వంశీ, స్రవంతి సంతానం. వంశీ మీడియా ప్రొఫెసర్ గా శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేస్తున్నారు. స్రవంతికి ఓ బాబు. తన కూతురు, మనవడుతో కలసి జమున ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు. జమునకు ఇందిరాగాంధీ అంటే ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 1991లో అదే నియోజకవర్గం నుండి ఓటమి చవిచూశారు. ఆ తరువాత కొంతకాలం ఆ పార్టీలోనే కొనసాగినా, ఆపై బీజేపీలో చేరారు.
Heroine Jamuna: టాలీవుడ్‌లో మరో విషాదం.. వెండితెర సత్యభామ కన్నుమూత..

Exit mobile version