Balayya Unstoppable Second Season 4th Episode Guests: నటసింహ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2లో నాలుగో ఎపిసోడ్ లో ఎవరొస్తారో మొన్న పిక్స్ ద్వారా తేలిపోయింది. ఈ సారి గెస్ట్స్ నిజంగానే స్పెషల్ అని చెప్పాలి. వారిలో ఒకరు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మరొకరు మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేశ్ రెడ్డి. వీరిద్దరు రాజకీయ నాయకులతోనూ బాలయ్యకు స్నేహబంధం ఉంది. వీరందరూ కలసి నిజామ్ కాలేజ్ లో చదువుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక సురేశ్ రెడ్డి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు.
‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ మొదటి ఎపిసోడ్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ లో పొలిటికల్ టచ్ ఇవ్వడమూ, ఆ ఇద్దరూ బాలయ్య స్నేహితులు కావడమూ మరింత విశేషం! ఈ ఎపిసోడ్ ఆరంభంలోనే బాలయ్య- యన్టీఆర్ ‘నిప్పులాంటి మనిషి’లోని “స్నేహమేరా జీవితం…” అంటూ డాన్స్ చేసి తన మిత్రులను పిలవడం భలేగా ఉంది. ఇక కాలేజ్ రోజుల్లో తాము చేసిన అల్లరి గురించి చెప్పగానే, “అక్కడ చేసింతరువాతే ఇక్కడ నటుడయ్యావ్…” అంటూ కిరణ్ కుమార్ రెడ్డి అనడం వినోదం పండించింది. ఇక సురేశ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాక, అమ్మాయిలకు సైట్లు కొడదమాని తాము బైక్స్ ఎక్స్ చేంజ్ చేసుకొనేవారమని బాలయ్య చెప్పారు. దానికి కిరణ్ కుమార్ రెడ్డి, “ఆ ఫీల్డ్ లో వీరిద్దరే హీరోలు…” అని చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ఈ మాటల్లోనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకోవడం, ఆయనను గ్రేట్ లీడర్ గా బాలయ్య అభివర్ణించడం కూడా ముచ్చట గొలుపుతుంది. తరువాత బాలయ్య బౌలింగ్, కిరణ్ కుమార్ బ్యాటింగ్, సురేశ్ రెడ్డి అంపైరింగ్ సరదాగా ఉంది.
మిత్రుల అల్లరి సాగుతుండగా, నటి రాధిక ఎంట్రీ స్పెషల్ అనే చెప్పాలి. చెన్నైలో తానున్నప్పుడు రాధిక తన గాడ్ ఫాదర్ అంటూ బాలకృష్ణ చెప్పడం ఆసక్తి కలిగిస్తుంది. “చిరంజీవిలో నీకు నచ్చనిదేంటి? నాలో నీకు నచ్చిందేంటి?” అంటూ రాధికను బాలయ్య ప్రశ్నించడం కూడా ఈ ఎపిసోడ్ లో చోటు చేసుకుంది. ప్రోమోలోనే ఈ విశేషాలు చూస్తోంటే ఆసక్తి కలిగిస్తూ ఉన్నాయి. మరి ఎపిసోడ్ మొత్తం చూసేస్తే జనం దబిడి దిబిడే అంటారేమో!
