Balakrishna Health Update: అభిమానుల ఆందోళనకు తెరపడింది. యాక్షన్ సీన్ చిత్రీకరణలో గాయపడిన నందమూరి బాలకృష్ణ విజయవంతంగా మోకాలి శస్త్రచికిత్స పూర్తి చేసుకుని కోలుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె నారా బ్రాహ్మణి స్వయంగా అప్‌డేట్ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నారా బ్రాహ్మణి భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. తమ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, బాలకృష్ణకు జరిగిన శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మునుపటిలాగే ఉత్సాహంగా ఉన్నారని, త్వరలోనే పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు చూపించిన ప్రేమ, ఆప్యాయత, ప్రార్థనలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆమె భావోద్వేగంగా తెలిపారు.
ఈ గాయం రాజమండ్రిలో ‘ఎన్‌బీకే111’ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగింది. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ మోకాలికి తీవ్ర గాయం కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యులు సమగ్ర పరీక్షలు నిర్వహించి, ఎడమ క్వాడ్రిసెప్స్ టెండన్ చీలిపోయిందని గుర్తించారు. అలాగే మోకాలికి ఉన్న కణజాలాలు కూడా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. వైద్యుల సూచన మేరకు వెంటనే శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు. ఆసుపత్రి విడుదల చేసిన వైద్య బులెటిన్ ప్రకారం ఈ ఆపరేషన్ మూడు గంటలకు పైగా సాగింది. శస్త్రచికిత్స ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తయిందని వైద్యులు కూడా స్పష్టం చేశారు.
బ్రాహ్మణి తాజా ప్రకటనతో పాటు ఆసుపత్రి బులెటిన్ కూడా అభిమానులకు మరింత ధైర్యాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం బాలకృష్ణ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం సంతృప్తికరంగా ఉందని సమాచారం. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ‘ఎన్‌బీకే111’ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ కోలుకుంటున్నారనే వార్తతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ అదే ఉత్సాహంతో తెరపై కనిపించాలని కోరుకుంటూ వేలాది మంది అభిమానులు సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. బాలయ్య త్వరలోనే సెట్స్‌లో అడుగుపెట్టనున్నారనే బ్రాహ్మణి ప్రకటనతో ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహం అయితే పరవళ్ళు తొక్కుతోంది.
Update on Naana: Surgery was a complete success! He’s already back to his full energetic self and will be back in action very soon. Thank you all so much for the overwhelming love and prayers showered on him – we are truly indebted to everyone. 🙏 pic.twitter.com/DeI9dMvmLI
— Brahmani Nara (@brahmaninara) July 24, 2026

