NTV Telugu Site icon

RIP T Rama Rao : సినీ పరిశ్రమకు తీరని లోటు… బాలకృష్ణ

Balakrishna

Balakrishna

సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలిసిన పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా తాతినేని రామారావు లేరన్న వార్త ఎంతగానో కలచి వేసిందని, ఆయన కన్నుమూయడం సినీ పరిశ్రమకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నారు.

Read Also : Director Tatineni Rama Rao Passes Away : టాలీవుడ్ లో మరో విషాదం

“దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన దర్శకులు తాతినేని రామారావు గారు ఈరోజు మనమధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. తాతినేని రామారావు గారి మరణ వార్త నన్నెంతగానో కలచివేసింది. తాతినేని రామారావు గారు అద్భుతమైన దర్శకులు. నాన్నగారితో చరిత్రలో నిలిచిపోయే ‘యమగోల’ లాంటి విజయవంతమైన చిత్రాలు తీసి మేటి దర్శకులుగా నిలిచారు. ఆయన దర్శకత్వంలో నేను కథానాయకుడిగా చేసిన ‘తల్లితండ్రులు’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి అభిమాన చిత్రంగా నిలిచింది. నిర్మాత పక్షాన నిలబడి, నిర్మాతకు ఒక రూపాయి మిగలాలని ఆలోచిస్తూ, అదే సమయంలో సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాలు నిర్మించే ప్రతిభ తాతినేని రామారావు గారి సొంతం. బాలీవుడ్ లోనూ హిట్ చిత్రాలు తీసి అక్కడా విజయవంతమైన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తాతినేని రామారావు గారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ తాతినేనితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ.

Show comments