ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘బధాయ్ హో’ సినిమా ఉత్తరాదిన విజయకేతనం ఎగరేసింది. ఆ సినిమా దక్షిణాది రీమేక్ హక్కుల్ని కొంతకాలం క్రితం బోనీకపూర్ సొంతం చేసుకున్నారు. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా రీమేక్ పనులు వేగంగా సాగలేదు. అయితే తాజాగా తమిళ రీమేక్ వరకూ బోనీ కపూర్ కొంత పురోగతిని సాధించారు. ఇటీవల ‘అమ్మోరు తల్లి’ మూవీలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఆర్. జె. బాలాజీ చేతికి ‘బధాయ్ హో’ రీమేక్ బాధ్యతలను బోనీకపూర్ అప్పగించారు. ఈ సినిమాలో హీరోగానూ ఆర్. జె. బాలాజీనే నటించబోతున్నాడు. అతని ప్రియురాలి పాత్రను అపర్ణ బాలమురళీ పోషించబోతోంది.
read also : LIVE : కృష్ణమ్మ పరవళ్లు
ఇక హిందీలో హీరో తల్లిదండ్రులుగా నటించిన గజరాజ్ రావ్, నీనా గుప్తా పాత్రలను తమిళంలో సత్యరాజ్, ఊర్వశి పోషించబోతున్నారు. ఈ తమిళ రీమేక్ కు ‘వీట్ల విశేషంగ’ అనే పేరు ఖరారు చేశారు. విశేషం ఏమంటే ఇదే పేరుతో 1994లో భాగ్యరాజా ఓ సినిమాను తెరకెక్కించారు. అందులో ఆయనే హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. ఇప్పుడు అదే ఫీట్ ను ఆర్. జె. బాలాజీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్ట్ లో ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్ పూర్తి చేస్తారట. మరి మిగిలిన దక్షిణాది భాషల్లో ‘బధాయ్ హో’ రీమేక్ ను బోనీకపూర్ ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి.
