Bad News To Prabhas Fans From Adipurush Team: ఆదిపురుష్ సినిమా అప్పుడెప్పుడో భూమి పుట్టినప్పుడు సెట్స్ మీదకి వెళ్లింది. ఆ వెంటనే చకచకా షూటింగ్ ముగించుకుంది. ఇంకేముంది.. ఇకపై అప్డేట్స్ వరుసగా వస్తాయని, సినిమా కూడా త్వరగా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, ఆ ఆశలపై దర్శకుడు ఓమ్ రౌత్ నీళ్లు చల్లేశాడు. రిలీజ్ సంగతి దేవుడెరుగు.. కనీసం ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తూ వస్తున్నాడు. సాధారణంగా హీరోల పుట్టినరోజులు లేదా పండుగ సందర్భాలు వచ్చినప్పుడు.. పోస్టర్లు రిలీజ్ చేయడమో, ఇతర అప్డేట్స్ ఇవ్వడమో చేస్తుంటారు. కానీ, ఓమ్ రౌత్ మాత్రం అందుకు భిన్నంగా మౌనం పాటిస్తూ వచ్చాడే తప్ప, ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. అప్పుడెప్పుడో రిలీజ్ డేట్ ప్రకటించాడు, ఆ తర్వాత కాన్సెప్ట్ పోస్టర్లు రిలీజ్ చేశాడు.. అంతే!
ఓవైపు అభిమానులు కనీసం ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేయవయ్యా సామీ అంటూ దండాలు పెడుతుంటే, ఓమ్ రౌత్ మాత్రం చూసి చూడనట్టుగా సైలెంట్‌గా ఉన్నాడు. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఓ అద్భుతమైన వార్త ఇటీవల తెరమీదకి వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్, దసరా సందర్భంగా రిలీజ్ కానుందని ఓ న్యూస్ ఒక్కసారిగా ఊడిపడింది. అది చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇన్నాళ్లూ తాము చేసిన వెయిటింగ్‌కి ఎట్టకేలకు ఫలితం దక్కబోతోందని సంతోషపడ్డారు. కానీ, ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేలోపే ఒక బాంబ్‌లాంటి వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. దసరాకి ఈ సినిమా టీజర్ రాకపోవచ్చన్నదే ఆ వార్త సారాంశం. టెక్నికల్ సమస్యల వల్లే ఆలోపు ఈ టీజర్ సిద్ధం కాకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. అంటే, మరోసారి అభిమానులకు నిరాశే మిగిలిందన్నమాట!
ఈ సినిమాలో గ్రాఫిక్స్ చాలా ఎక్కువగా ఉంటుందని డైరెక్టర్ ఓమ్ రౌత్ ఇదివరకే చాలాసార్లు చెప్పాడు. అందుకోసం ఎక్కువ సమయం పడుతుందని, తాము అద్భుతమైన్ ఔట్‌పుట్ తీసుకొచ్చేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నామని చెప్పాడు. జనాలు వెండితెరపై సహజత్వాన్ని ఫీలయ్యే రీతిలో దాన్ని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. బహుశా అందుకోసమేనేమో.. అనుకున్న సమయానికి టీజర్‌ని రిలీజ్ చేయలేకపోతున్నారు. మరి, ఇంకెప్పుడు విడుదల చేస్తారో చూడాలి. అటు రిలీజ్ డేట్ ఏమో దగ్గర పడుతుంది. దాంతో, చెప్పిన సమయానికైనా సినిమాని రిలీజ్ చేస్తారో లేదోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
