Site icon NTV Telugu

New Movie: రిటైర్డ్ మేజర్ గా ‘బాహుబలి’ ప్రభాకర్!

Retired Major movie

Retired Major

‘బాహుబలి’ సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీని పొందిన ప్రభాకర్ ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. తాజాగా అతను ప్రధాన పాత్రధారిగా ఆర్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై గురువారం ఫిల్మ్ నగర్ లోని దైవసన్నిధానంలో ఓ సినిమా ప్రారంభమైంది. పాలిక్ దర్శకత్వంలో రావుల రమేశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు, నటుడు వై. కాశీ విశ్వనాథ్ క్లాప్ ఇవ్వగా, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా ‘బాహుబలి’ ప్రభాకర్ మాట్లాడుతూ, ”రిటైర్డ్ ఆర్మీ ఆఫీస‌ర్ జీవితంలో ఓ రాత్రి ఏం జ‌రిగింది అనేది క‌థాంశం. రెండేళ్ల క్రితం డైర‌క్ట‌ర్ పాలిక్ గారు ఈ క‌థ‌తో క‌లిశారు. క‌రోనా వ‌ల్ల అప్పుడు కుద‌ర్లేదు. ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలాగా మ‌ళ్లీ పాలిక్ గారు ఈ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కిస్తున్నారు. ఇందులో నేను హీరో అని చెప్ప‌ను కానీ సినిమాకు ఎంతో కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాను” అని అన్నారు.

ద‌ర్శ‌కుడు పాలిక్ మాట్లాడుతూ, ”ఆర్.ఆర్ క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న తొలి చిత్ర‌మిది. ఈ క‌థ నా శిష్యురాలు వింధ్యా రెడ్డి ఇచ్చారు. త‌ను చెప్పిన లైన్ తో దీన్నొక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంగా మలిచి తెర‌కెక్కిస్తున్నాం. ఒక మేజ‌ర్ జీవితంలో ఒక నైట్ ఏం జ‌రిగింది? అనేది సినిమా స్టోరి. ‘బాహుబ‌లి’ ప్ర‌భాక‌ర్ గారిని ఇందులో కొత్త కోణంలో… డ్యూయ‌ల్ షేడ్స్ లో చూస్తారు. ఇందులో మూడు పాట‌లున్నాయి. జాన్ భూషణ్ అద్భుత‌మైన ట్యూన్స్ ఇచ్చారు. అదే స్థాయిలో సురేష్ గంగుల సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. నాగిరెడ్డి గారి ఎడిటింగ్, మ‌ల్లిక్ సినిమాటోగ్ర‌ఫీ.. ఇలా టెక్నిక‌ల్ టీమ్ అంతా ఎంతో బాగా కుదిరింది. ఈ నెలాఖ‌రులో షెడ్యూల్ ప్రారంభిస్తాం. తొలి షెడ్యూల్ గోవాలో, రెండో షెడ్యూల్ హైద‌రాబాద్, అర‌కులో చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం” అని అన్నారు.

Exit mobile version