Site icon NTV Telugu

Ashwini Dutt : అప్పుడు ఎస్.పి.B… ఇప్పుడు ఎస్.పి.C…

Sp Charan

Sp Charan

Then S.P.B.. Now S.P.C.. :
వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ కు మధురగాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. దత్ తొలిసారి నిర్మాణభాగస్వామిగా నిర్మించిన ‘ఓ సీత కథ’, ఆ తరువాత వైజయంతీ మూవీస్ స్థాపించి ‘ఎదురులేని మనిషి’ నిర్మించాక కూడా బాలుతోనే దత్ ప్రయాణం సాగింది. నేడు బాలు భౌతికంగా లేకపోయినా, తన మదిలో సదా ఉంటారని దత్ తాను నిర్మించిన తాజా చిత్రం ‘సీతారామం’ స్పెషల్ ప్రోగ్రామ్ లోనూ చాటుకున్నారు. ‘సౌండ్ ఆఫ్ సీతారామం’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీబీకి ఘననివాళి అర్పించారు దత్. ఇక ‘సీతారామం’లో బాలు లేనికొరతను తీరుస్తూ ఆయన తనయుడు ఎస్.పి.చరణ్ పాటలు పాడారు. ఈ సందర్భంగా చరణ్ – “అప్పుడు ఎస్.పి.B… ఇప్పుడు ఎస్.పి.C… దత్ గారితో ఈ బంధం ఇలా కొనసాగుతూనే ఉంటుంది” అన్నారు.

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘సీతారామం’ తెరకెక్కింది. ఆగస్టు 5న ఈ చిత్రం విడుదల కానుంది. ‘సీతారామం’లోని “ఓ సీతా… హే రామా…” అనే పాటను రమ్య బెహరాతో కలసి ఎస్పీ చరణ్ ఆలపించారు. అలాగే “ఇంతందం…” అంటూ సాగే పాటను కూడా ఎస్పీసీ పాడారు. ఈ చిత్రానికి  విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చగా, సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్, కృష్ణకాంత్ పాటలు రాశారు. మరి ఇందులో తాను పాడిన పాటలతో ఎస్పీసీకి ఏ తరహా గుర్తింపు వస్తుందో చూడాలి.

Exit mobile version