‘మెగాస్టార్’ అన్న పదాన్ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన ఘనుడు ఓ నాటి మేటి కండలవీరుడు ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్. తెరపై తళుక్కుమనక ముందే మిస్టర్ యూనివర్స్, మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఒలింపియా పోటీల్లో భళా అనిపించిన ఆర్నాల్డ్ వెండితెరపై వెలిగిపోగానే ఎంతోమంది వెలదుల మదిని దోచారు. ‘కనాన్ ద బార్బేరియన్, టెర్మినేటర్’ సిరీస్ తోనూ, “కమెండో, ప్రిడేటర్, రా డీల్, ట్రూ లైస్” వంటి చిత్రాలతోనూ ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానగణాలను పోగేశారు ఆర్నాల్డ్. 2019లో రూపొందిన ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’లో చివరిసారిగా ష్వాజ్ నెగ్గర్ కనిపించారు. ఆయన నటించిన ‘కుంగ్ ఫ్యూరీ 2’ గత సంవత్సరమే పూర్తయినా, కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. ఈ యేడాది ఆ సినిమా వెలుగు చూడవచ్చని వినిపిస్తోంది. ఏమైనా నాలుగేళ్ళ తరువాతే ఆర్నాల్డ్ కనిపించబోతున్నారు. ఇప్పుడు తాజాగా ‘బ్రేకౌట్’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించారు ఆర్నాల్డ్.
‘బ్రేకౌట్’లో టెర్రీ రేనాల్డ్స్ అనే పాత్రలో ఆర్నాల్డ్ కనిపించబోతున్నారు. ఆయన ఇమేజ్ కు తగ్గ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది. ‘బ్రేకౌట్’ కథాంశమేమిటంటే – ఇందులో టెర్రీ స్టెప్ సన్ ఓ విదేశానికి వెళ్ళి, అక్కడ ఓ నేరంలో చిక్కుకుంటాడు. అందుకు అక్కడి కోర్టు అతనికి పాతికేళ్ళ జైలు శిక్ష విధిస్తుంది. ఈ విషయం తెలిసిన టెర్రీ సవతి కొడుకును అక్కడ నుండి విడుదల చేసి తీసుకురావడమే ధ్యేయంగా ఆ దేశానికి వెళతాడు. అక్కడ ఎలాంటి పోరాటాలు చేసి, తన అబ్బాయిని రక్షించుకున్నాడు అన్నదే మిగిలిన కథ. త్వరలోనే ‘బ్రేకౌట్’ షూటింగ్ తూర్పు యూరప్ లో మొదలు కానుంది. 75 ఏళ్ళ వయసులో ఆర్నాల్డ్ ఏ తీరున యాక్షన్ పండిస్తారో చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు జనం ముందుకు వస్తుందో చూడాలి.
