Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!

Citizen Vigilante 300kb

Citizen Vigilante 300kb

Citizen Vigilante: హాలీవుడ్ నటుడు ఆర్మీ హామర్ నటించిన ‘సిటిజన్ విజిలాంటే’ (Citizen Vigilante) వివాదాల నడుమ వార్తల్లో నిలుస్తోంది. సినిమాలో చూపించిన విపరీతమైన హింస, వలసదారుల కథనంతో ఈ మూవీకి సమస్యలు తెచ్చి పెట్టాయి. జర్మనీలో ఈ సినిమాకు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్టిఫికెట్ నిరాకరించడంతో దర్శకుడు ఉవే బోల్ తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత ఆయన ఎలాన్ మస్క్‌ను ఆశ్రయించడం, మస్క్ జూన్ 25న సినిమాను Xలో 48 గంటల పాటు అందుబాటులో ఉంచడంతో కథ ఒక్కసారిగా మరో మలుపు తిరిగింది.

వివాదాస్పద దర్శకుడు ఉబే బోల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ‘సిటిజన్ విజిలాంటే’ (Citizen Vigilante) జర్మనీలో తీవ్రమైన వివాదాల నడుమ 2026 జూన్ 19న విడుదలైంది. అయితే జర్మనీ సెన్సార్ బోర్డు (FSK) ఈ సినిమాకు Age Rating ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించింది. చట్టప్రకారం రేటింగ్ లేని సినిమాలను జర్మనీలో థియేటర్లలో ప్రదర్శించడానికి వీలుండదు. ఈ నిర్ణయంపై దర్శకుడు ఉబే బోల్ జర్మన్ కోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ కూడా 6-2 ఓట్ల తేడాతో ఆయనకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. ఇంటర్నెట్‌లో దీనికి విపరీతమైన మద్దతు లభించడంతో బోర్డు పునఃసమీక్ష జరిపింది. చివరకు జూలై 2026లో FSK ఈ సినిమాకి ’18+’ రేటింగ్‌ను ఖరారు చేస్తూ జర్మనీ థియేటర్లలో పెద్దలు చూసేందుకు  మాత్రమే అనుమతులు మంజూరు చేసింది.

ఈ వివాదానికి అసలు కారణం ఈ కథే. ఇందులో సాండర్స్ అనే అమెరికన్ పాత్రలో ఆర్మీ హామర్ కనిపించాడు. యూరప్‌లో నివసించే అతడికి ఒక దారుణమైన సంఘటన తర్వాత పోలీసులపై, న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుంది. దీంతో నేరస్థులను చట్టం ద్వారా శిక్షించడం సరిపోదని భావించి తానే రంగంలోకి దిగుతాడు. అత్యాచారాలు, హింసాత్మక నేరాలకు పాల్పడిన వారితో పాటు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అతడు భావించే అధికారులు, న్యాయమూర్తులను కూడా టార్గెట్ చేస్తాడు. ఈ క్రమంలో అతడి చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది అతడిని హీరోగా చూడటం, మరోవైపు పోలీసులు అతడిని ప్రమాదకర నేరస్థుడిగా పరిగణించడం కథలో కీలకంగా మారుతుంది. ఇక్కడి నుంచే సినిమా అసలు వివాదం మొదలవుతుంది. సినిమాలో వలసదారుల పాత్రలను నేరస్థులుగా చూపించడం, ముఖ్యంగా హింసాత్మక నేరాలు చేసే వ్యక్తులుగా చిత్రీకరించడం వల్ల విమర్శలు వచ్చాయి. అదే సమయంలో హీరో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడాన్ని సమర్థించేలా సినిమా ఉందని విమర్శకులు ఆరోపించారు.

ఈ కథకు దర్శకుడు ఉవే బోల్ చెప్పిన మరో నేపథ్యం కూడా ఉంది. 2016లో హాంబర్గ్‌లో జరిగిన ఒక సామూహిక అత్యాచార కేసు తనను ప్రభావితం చేసిందని ఆయన వెల్లడించారు. నేరాలకు పాల్పడిన వారికి విధించిన శిక్షలపై అప్పట్లో జరిగిన చర్చ తన ఆలోచనలను ప్రభావితం చేసిందని బోల్ పేర్కొన్నారు. అయితే సినిమా పూర్తిగా ఆ ఘటనకు సినిమా రూపం కాదని, దాని చుట్టూ ఉన్న సామాజిక, రాజకీయ ఆగ్రహాన్ని తన కథలో ఉపయోగించుకున్నట్లు ఆయన వివరిస్తున్నారు.

ఇదే సమయంలో దర్శకుడు ఉవే బోల్ తన సినిమాపై వచ్చిన ఆంక్షలను సెన్సార్‌షిప్‌గా అభివర్ణిస్తూ ఎలాన్ మస్క్‌ను బహిరంగంగా సంప్రదించారు. మస్క్ స్పందిస్తూ జూన్ 25, 2026న ‘Citizen Vigilante’ పూర్తి సినిమాను తన X ఖాతా ద్వారా 48 గంటల పాటు అందుబాటులో ఉంచారు. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దృష్టి ఈ చిన్న బడ్జెట్ వివాదాస్పద సినిమాపై పడింది. మస్క్ చర్యతో సినిమా చుట్టూ ఉన్న చర్చ మరింత పెద్దదైంది. అంతేకాదు, మస్క్ సినిమా సీక్వెల్‌పై కూడా స్పందించారు. ‘Citizen Vigilante 2’ మరింత బాగుంటుందని ఆయన Xలో పేర్కొనడంతో రెండో భాగంపై కూడా చర్చ మొదలైంది. దర్శకుడు ఉవే బోల్ సైతం సీక్వెల్‌ను 2027లో తీసుకురానున్నట్లు ప్రకటించడంతో ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.