నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘కార్తికేయ -2’ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ దర్శకుడు చందూ మొండేటికి మనస్పూర్తిగా క్షమాపణలు తెలిపింది. రెండేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా, ఇప్పుడు జనం ముందుకు వచ్చి ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందని చెబుతూనే… షూటింగ్ లో జరిగిన ఓ చేదు అనుభవాన్ని అనుపమా గుర్తు చేసుకుంది. ‘గుజరాత్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు బ్యాక్ ఏక్ వచ్చిందని, అయినా ఎలాగో కష్టపడి ఆ షెడ్యూల్ పూర్తి చేశాన’ని చెప్పింది. ఒక రోజు టెక్నికల్ ఇష్యూస్ కారణంగా షూటింగ్ చాలా ఆలస్యమైందని, తనకూ బాగా పెయిన్ ఉండటంతో, ఫ్రస్ట్రేషన్ కు గురై, ‘చందు మొండేటి తో వర్క్ చేయడం పట్ల రిగ్రేట్ ఫీలవుతున్నాన’ని చెప్పానని తెలిపింది. ఆ రోజు తాను అలా మాట్లాడుకుండా ఉండాల్సిందని, తన వైపు నుండి పెద్ద తప్పే జరిగిందని అనుపమా బాధపడింది. అందుకు ఆయనకు ఇవాళ బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని అనుపమా అంది. ఆయనతో వర్క్ చేయడం వల్లే ఇంత గొప్ప విజయం తనకు లభించిందని చెప్పింది. ఈ విజయాన్ని హీరో నిఖిల్ తో పాటు తానూ ఇంకా జీర్ణించుకోలేకుండా ఉన్నానని, ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకుడు చందూ మొండేటికి అనుపమా పరమేశ్వరన్ కృతజ్ఞతలు తెలిపింది.
