Site icon NTV Telugu

Anup Rubens Birthday Special: అలరిస్తోన్న అనూప్ రూబెన్స్ బాణీలు!

Anup Rubens

Anup Rubens

ఏప్రిల్ 18న అనూప్ రూబెన్స పుట్టిన రోజు సంగీతం పరబ్రహ్మ స్వరూపం! అది ఎవరిని ఎప్పుడు కరుణిస్తుందో చెప్పలేం. అనూప్ రూబెన్స్ ను ఆ సంగీతలక్ష్మి కటాక్షించింది. పిన్నవయసులోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని, ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ తెలుగు సినిమా సంగీతప్రపంచంలో సాగుతున్నారు అనూప్.

అనూప్ రూబెన్స్ అసలు పేరు ఈనోక్ రూబెన్స్ . 1980 ఏప్రిల్ 18న అనూప్ జన్మించారు. చిన్నతనంలోనే గిటార్, డ్రమ్స్ ప్లే చేస్తూ సాగారు. ఏదైనా ఉత్సవాల్లోనూ, చర్చిలోనూ ఆయన తన సంగీత విద్య ప్రదర్శిస్తూ వచ్చారు. అనుకోకుండా సినిమా రంగంవైపు అనూప్ దృష్టి సారించారు. ఆరంభంలో కొన్ని ఆల్బమ్స్ చేశారు. అప్పట్లో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ తేజ కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఆయనను కలుసుకున్న అనూప్ కు తాను తెరకెక్కించిన ‘జై’ సినిమాతో సంగీత దర్శకునిగా అవకాశం కల్పించారు తేజ. ఆ సినిమాలోని పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. తరువాత తేజ తాను తెరకెక్కించిన ‘ధైర్యం’ చిత్రానికీ అనూప్ కే స్వరకల్పన చేసే అవకాశం అందించారు. ఈ రెండు చిత్రాలతో అనూప్ కు ఓ గుర్తింపు లభించింది. పలువురు దర్శకులు అనూప్ కు అవకాశాలు కల్పించారు. ప్రతీసారి అనూప్ బాణీలు ఆకట్టుకున్నాయి. కానీ, అవసరమైన కమర్షియల్ సక్సెస్ దొరకలేదు. ఆ సమయంలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమకావాలి’ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతోనే ఆది సాయికుమార్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్ర విజయంతో అనూప్ పై అనేక మంది దర్శకనిర్మాతలకు గురి కుదిరింది. సునీల్ ‘పూలరంగడు’, నితిన్ ‘ఇష్క్’, ఆది సాయికుమార్ ‘లవ్లీ’ చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో అనూప్ బాణీలకూ జనం జేజేలు పలికారు. ‘ఇష్క్’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన నితిన్ తన ‘గుండె జారి గల్లంతయ్యిందే’కు కూడా అనూప్ నే ఎంచుకున్నారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం’కు స్వరకల్పన చేసే అవకాశం అనూప్ కు దక్కింది. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల స్టార్ హీరోస్ నటించిన ఏకైక చిత్రం ‘మనం’కు సంగీతం సమకూర్చడం నిజంగా అనూప్ కు లభించిన అదృష్టమనే చెప్పాలి. నటనిర్మాత నాగార్జున తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుతూ ‘మనం’ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గానూ మలిచారు అనూప్.

అనూప్ బాణీలకు పట్టం కడుతూ ఎంతోమంది పేరున్న దర్శకులు తమ చిత్రాలకు సంగీతం చేసేందుకు ఎర్రతివాచీ పరచి ఆయనను ఆహ్వానించారు. బాలకృష్ణ ‘పైసా వసూల్’, యన్టీఆర్ ‘టెంపర్’, వెంకటేశ్, పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’, అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’, నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’, రానా ‘నేనే రాజు- నేనే మంత్రి’ వంటి జనరంజక చిత్రాలకు అనూప్ రూబెన్స్ బాణీలు దన్నుగా నిలిచాయి. ఇప్పటికీ తన దరికి వచ్చిన చిత్రాలకు న్యాయం చేయాలనే తపిస్తున్నారాయన. ఈ యేడాది అనూప్ రూబెన్స్ బాణీల్లో దాదాపు తొమ్మిది చిత్రాలు రూపొందాయి. వాటిలో ఇప్పటికే ‘బంగార్రాజు’, ‘మళ్ళీ మొదలయింది’ చిత్రాలు వెలుగు చూశాయి. మరో ఏడు సినిమాలు జనం ముందుకు రావలసి ఉన్నాయి. అనూప్ భవిష్యత్ లోనూ తన బాణీలతో జనాన్ని మురిపిస్తూనే ఉంటారని ఆశిద్దాం.

Exit mobile version