ANR Paradesi Movie Completed 70 Years: మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘అంజలీ పిక్చర్స్’కు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఏయన్నార్ హీరోగా ఎంతగానో అలరించిన ‘కీలుగుర్రం, బాలరాజు’ వంటి జానపద చిత్రాల్లో అంజలీదేవి కీలక పాత్రలు పోషించారు. అంతేకాదు తరువాతి రోజుల్లో అక్కినేని, అంజలీదేవి, ఆమె భర్త ఆదినారాయణరావు, గోపాలకృష్ణన్ తో కలసి ‘అశ్వనీ పిక్చర్స్’ అనే సంస్థను నెలకొల్పి ‘మాయలమారి’ వంటి కొన్ని చిత్రాలు నిర్మించారు. ఆ తరువాత ‘అశ్వనీ’ సంస్థ నుండి అంజలీదేవి, ఆదినారాయణరావు బయటకు వచ్చి సొంతగా ‘అంజలీ పిక్చర్స్’ సంస్థను స్థాపించారు. తమ తొలి ప్రయత్నంగా యల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ‘పరదేశి’ అనే సినిమాను నిర్మించారు. ఇందులో ఏయన్నార్ హీరో కాగా, తరువాతి రోజుల్లో తమిళనాట స్టార్ హీరోగా రాణించిన శివాజీగణేశన్ ఈ చిత్రంతోనే తెలుగువారికి పరిచయం కావడం విశేషం! 1953 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలై మంచి ఆదరణ చూరగొంది.
‘పరదేశి’ కథ విషయానికి వస్తే – చంద్రం తండ్రి మరణించడంతో ఆవేదన నిండి ఉంటాడు. అలాంటి చంద్రానికి మిత్రుడు రఘు అనునయ వచనాలతో ఊరట కలిగిస్తాడు. జీవితంపై ఆశ కలిగిస్తాడు. హఠాత్తుగా రఘు మరణిస్తాడు. దాంతో రఘు భార్య, కొడుకు ఆనంద్ భారాన్ని తనమీద వేసుకుంటాడు చంద్రం. తన వారిని పోషించడానికి రేయింబవళ్ళు కష్టపడుతున్న చంద్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. డాక్టర్ సలహా మేరకు చంద్రం కొంతకాలం ఏదైనా పర్వత ప్రాంతంలో పరిశుభ్రమైన గాలి పీల్చుకోవాలని భావిస్తాడు. అలా సీతగిరికి వెళ్తాడు. అక్కడ లక్ష్మి అనే పూలు అమ్మే అమ్మాయి పరిచయం అవుతుంది. కొండజాతి వారు పట్నం నుండి వచ్చే వారిని ‘పరదేశి’ అని పిలుస్తూ ఉంటారు. అలా చంద్రాన్ని లక్ష్మి ‘పరదేశి’ అని సంబోధిస్తూ ఉంటుంది. వారి పరిచయం కాస్తా ప్రణయంగా మారి, తరువాత ఆమెనే చంద్రం పరిణయం చేసుకొనేలా చేస్తుంది. చంద్రం, లక్ష్మి దంపతులు అన్యోన్యంగా ఉంటారు. లక్ష్మి తండ్రి రంగడికి ఈ విషయం తెలిసి, చంద్రాన్ని తీసుకు రమ్మంటాడు. ఆమె చంద్రం బస చేసే వసతి గృహానికి వెళ్ళి చూడగా, అతను కనిపించడు. గర్భవతి అయిన కూతురును నానా మాటలు అన్న రంగడు, ‘పరదేశీ’లను ఎప్పటికీ నమ్మరాదని చెబుతాడు. తరువాత రంగడు ఆత్మహత్య చేసుకుంటాడు. లక్ష్మి ఓ పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. చంద్రం వచ్చి, లక్ష్మి కోసం ఎంతగానో గాలిస్తాడు. అయితే ఆమె జాడ తెలుసుకోలేడు. కాలచక్రభ్రమణంలో లక్ష్మి కూతురు తార పెరిగి పెద్దదవుతుంది. చంద్రం నీడలో పెరిగిన రఘు కొడుకు ఆనంద్ తో తారకు పరిచయం ఏర్పడుతుంది. వారిద్దరూ ప్రేమించుకుంటారు. ఈ విషయం తార తల్లికి చెబుతుంది. ‘పరదేశీ’లను ఎప్పుడూ ప్రేమించరాదని, వారు మోసం చేస్తారని కూతురును మందలిస్తుంది లక్ష్మి. అయితే ఆనంద్ ఈ విషయాన్ని చంద్రంకు తెలుపడం, ఆ తరువాత పలు మలుపులు చోటు చేసుకొని భార్యాభర్తలైన లక్ష్మి, చంద్రం కలుసుకోవడం జరుగుతుంది. ఆ పై వారి అనుమతితోనే ఆనంద్, తార పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో చంద్రంగా ఏయన్నార్, లక్ష్మిగా అంజలీదేవి, ఆనంద్ గా శివాజీ గణేశన్, తారగా వసంత, రంగడుగా ఎస్వీఆర్ నటించారు. ఈ చిత్రానికి 1950లో రూపొందిన హిందీ చిత్రం ‘రాజ్-రాణి’ ఆధారం. ఈ సినిమా సమయానికి ఏయన్నార్ వయసు 29 సంవత్సరాలు, అంజలీదేవికి 25 ఏళ్ళు అయినా, వారిని వయసు మీద పడినవారిగా నటింప చేసి, జనాన్ని ఆకట్టుకొనేలా చేశారు ఎల్వీ ప్రసాద్. మల్లాది రాసిన పాటలకు ఆదినారాయణ రావు బాణీలు కట్టారు. ఇందులోని “జీవితమే హాయి…”, “జాతి భేదాలు మరచి…”, “గాజులో గాజులు…”, “పిలిచింది కలువపువ్వు…”, “నేనెందుకు రావాలి…”, “కనికరమే లేని…”, “రావో తోడి రాజా…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. 1953 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ‘పరదేశి’ చిత్రం తమిళ వర్షన్ జనవరి 31న విడుదలయింది.
అంజలీ పిక్చర్స్ తొలి చిత్రం ‘పరదేశి’లో హీరోగా నటించిన ఏయన్నార్ తరువాత ఈ సంస్థ నిర్మించిన “అనార్కలి, సువర్ణసుందరి, రుణానుబంధం, భక్త తుకారాం, మహాకవి క్షేత్రయ్య” వంటి చిత్రాలలో నటించారు. శివాజీ గణేశన్ అసలు పేరు విల్లుపురం చిన్నయ్య పిళ్ళై గణేశన్. ప్రముఖ రచయిత, తరువాతి రోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి అయిన అన్నాదురై రాసిన ‘శివాజీ కంద హిందూ సామ్రాజ్యం’ నాటకంలో శివాజీగా నటించి మంచి పేరు సంపాదించారు. దాంతో అందరూ గణేశన్ పేరు ముందు ‘శివాజీ’ చేర్చి పిలిచేవారు. అతని అభినయం చూసిన అంజలీదేవి, ఆదినారాయణరావు మరో మాట లేకుండా శివాజీ గణేశన్ ను తమ ‘పరదేశి’/ తమిళంలో ‘పూంగోదై’ చిత్రాల్లో నటించడానికి ఎన్నుకున్నారు. ఈ సినిమా అంగీకరించాకే శివాజీ గణేశన్ కు తమిళంలో ‘పరాశక్తి’లో హీరోగా నటించే అవకాశం లభించింది. అయితే ముందుగా ‘పరాశక్తి’ విడుదలయింది. తరువాత ‘పరదేశి’ జనం ముందుకు వచ్చింది. అలా అంజలీ సంస్థ అంటే శివాజీగణేశన్ కు ఎంతో అభిమానం. అందువల్లే 1973లో ‘భక్త తుకారాం’లో శివాజీ పాత్రలో నటించడానికి శివాజీ గణేశన్ ముందుకు వచ్చారు. ఒక్క పైసా కూడా పారితోషికం తీసుకోకుండా శివాజీ నటించారు. తరువాతి రోజుల్లో ‘భక్త తుకారాం’లో శివాజీ పాత్రకు తాను ధరించిన కాస్ట్యూమ్స్ ను శివాజీ, అంజలీదేవి, ఆదినారాయణ రావును అడిగి మరీ తీసుకున్నారు. ఆ దుస్తులతోనే శివాజీ గణేశన్ కేంద్రప్రభుత్వం నిర్మించిన ‘శివాజీ’ డాక్యుమెంటరీలో నటించారు.