Another Video Leaked From Salaar Movie Sets: సాధారణంగా పెద్ద సినిమాలపై ఇండస్ట్రీలో మంచి బజ్, అభిమానుల్లో తారాస్థాయి క్యూరియాసిటీ ఉంటుంది. దాన్ని అంతకంతకు పెంచేందుకు.. యూనిట్ వర్గాలు అప్డేట్స్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంటాయి. ఎంత ఆలస్యంగా అప్డేట్స్ ఇస్తే.. దాని ప్రభావం అంతకుమించి ఉంటుందన్నది మేకర్స్ భావన. అందుకే, సినిమా సెట్స్‌లో ఉన్నప్పుడు ఏదీ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినప్పటికీ.. ఎలాగోలా వీడియోలు లీక్ అవుతుంటాయి. ఇప్పుడు ‘సలార్’ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమాకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటోన్నా.. లీకుల బెడద తప్పట్లేదు.
ఇంతకుముందే ఓ యాక్షన్ సీన్‌లో భాగంగా ప్రభాస్ గన్‌తో షూట్ చేస్తోన్న ఒక వీడియో లీకైన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మేకింగ్ వీడియో బయటకొచ్చింది. ఒకవైపు కెమెరామెన్లు కెమెరాని సెట్ చేసే పనిలో ఉండగా.. మరోవైపు ప్రభాస్ స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తుండడాన్ని ఆ లీకైన క్లిప్‌లో చూడొచ్చు. ఈ వీడియో లీక్ అవ్వడమే ఆలస్యం.. అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. కొందరైతే తమకు నచ్చినట్టుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేసుకొని, వీడియోకి మరిన్ని హంగులు తీర్చిదిద్దారు. అయితే.. వెంటనే అలర్ట్ అయిన చిత్రబృందం, సోషల్ మీడియా నుంచి లీకైన వీడియోని తొలగించే పనిలో నిమగ్నమైంది. అయితే, ఈలోపే జరగాల్సిన ఘోరమైతే జరిగిపోయింది. వీడియో వైరల్ అవ్వడంతో, డౌన్‌లోడ్ చేసుకొని మళ్లీ నెట్టింట్లో పోస్ట్ చేస్తున్నారు.
కాగా.. అటు కేజీఎఫ్‌తో సంచలనాలు నమోదు చేసిన ప్రశాంత్ నీల్, ఇటు పాన్ ఇండియా చిత్రాలతో సత్తా చాటుతోన్న ప్రభాస్ కాంబోలో ‘సలార్’ రూపొందుతుండడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సీని ప్రియులు.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇదిలావుండగా.. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది.
