తెలుగు సినిమా పాట అనగానే పల్లవి, కొన్ని సార్లు అనుపల్లవి ఆ తరువాత రెండు లేదా మూడు చరణాలు ఉండడం ఆనవాయితీ. ఇది మన దగ్గరే కాదు, పాటలతో చిందులు వేయించే ప్రతీచోటా ఉంటుంది. ఇలాంటి పదకవితలకు ఆద్యుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. అందుకే ఆయనను పదకవితాపితామహుడు అన్నారు. ఆయన పంథాలో పయనించని తెలుగు సినిమా రచయితలు లేరనే చెప్పాలి. అన్నమయ్య ఏర్పరచిన బాటలోనే తెలుగు సినిమా వెలుగు చూసిన తొలి రోజుల్లో పాటలు సాగాయి. అంటే ప్రాస, యతిమైత్రి ఉంటూ ఛందోబద్ధంగా ఉంటూ చలనచిత్ర గేయాలు అలరించాయి. రాను రాను పాటల తీరు మారింది. అందుకు కొందరు సంగీత దర్శకులు, దర్శకులు, నిర్మాతలు కారణం కావచ్చు. బాణీకి తగ్గ వాణినే వినిపించడం మొదలయ్యాక, శబ్ధసౌందర్యమే తప్ప పదసౌందర్యం తరిగిపోయింది. అదలా ఉంచితే పదకవితాపితామహుని సంకీర్తనలను మన తెలుగు సినిమాల్లో అనువుగా వినియోగించుకోవడం విశేషం!
తన పదకవితలతో మనలను మురిపించిన అన్నమాచార్య సంకీర్తనలు దేశవిదేశాల్లో వీనులవిందు చేస్తున్నాయి. ఆ రోజుల్లోనే ఘంటసాల మాస్టారు తన అమెరికా పర్యటనలో చికాగోలో అన్నమయ్య సంకీర్తన “కొలనుదోపరికి గొబ్బిల్లో…” పాడి అక్కడి తెలుగువారిని విశేషంగా అలరించారు. ఆ తరువాత “బ్రహ్మకడిగిన పాదము…” అన్న సంకీర్తన కూడా ఘంటసాల గాత్రంలో జాలువారి తెలుగువారికి పరమానందం పంచింది. ఈ మధ్యకాలంలో విదేశాలలోని మన తెలుగువారిని అలరించేందుకు ఎందరో గాయనీగాయకులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తున్నారు.
అన్నమయ్య సంకీర్తనలను ఎక్కువగా తన చిత్రాల్లో చొప్పించినవారు దర్శకులు కె.విశ్వనాథ్. తొలినుంచీ సంగీతసాహిత్యాలపై ఎంతో మమకారం ఉన్న విశ్వనాథ్ అన్నమయ్య పదరచనపై మనసుపడ్డారు. తన ‘నిండుహృదయాలు’లో అన్నమయ్య సంకీర్తనల్లోని “రామాలాలీ మేఘశ్వామాలాలీ…” మకుటాన్ని మాత్రం వాడుకొని, తరువాత సందర్భాను సారంగా చరణాలు రాయించుకున్నారు. విశ్వనాథ్ అంటే ఎంతో గౌరవించే ఈ తరం దర్శకుడు త్రివిక్రమ్ సైతం తన ‘అత్తారింటికి దారేది’లో “దేవదేవంభజే దివ్యప్రభావం…” అనే సంస్కృత సంకీర్తనలోని పల్లవిని వాడుకుని, చరణాలు తెలుగులో కథానుసారం పలికించుకున్నారు. ఇక విశ్వనాథ్, చిరంజీవితో తాను తెరకెక్కించిన ‘శుభలేఖ’లో “నెయ్యములల్లో నేరేల్లో…” సంకీర్తనను పూర్తిగా వినియోగించుకున్నారు. ఆయన తెరకెక్కించిన ‘శ్రుతిలయలు’లో అయితే ఏకంగా రెండు అన్నమయ్య సంకీర్తనలను వాడుకోవడం జరిగింది. అందులో “బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే…”ను సందర్భోచితంగా ఉపయోగించుకున్నారు. అదే చిత్రంలో “ఇన్నిరాశుల యునికి ఇంతి చెలువపు రాశి…” సంకీర్తనను యుగళంగానూ తెరకెక్కించడం విశేషం. విశ్వనాథ్ దర్శకత్వంలోనే రూపొందిన ‘స్వర్ణకమలం’లో “చేరి యశోదకు శిశువితడు…” అనే సంకీర్తనను కొంత ఉపయోగించుకున్నారు. విశ్వనాథ్ రూపొందించిన కొన్ని చిత్రాలకు రచన చేసిన జంధ్యాల కూడా గురువు బాటలో పయనిస్తూ తన ‘పడమటి సంధ్యారాగం’లో “ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు…” సంకీర్తనను కనువిందుగా చిత్రీకరించారు. జంధ్యాలతో కొన్ని చిత్రాలకు రచన చేయించుకున్న కె.రాఘవేంద్రరావు తన ‘అల్లుడుగారు’లో “కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు…” అనే సంకీర్తనను కొంత ఉపయోగించుకున్నారు. ఏసుదాసు గళంలో జాలువారిన ఈ పాట ఈ నాటికీ అలరిస్తూనే ఉంది. శారద ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కలియుగ దైవం’లో “అదివో అల్లదివో…” అనే అన్నమయ్య సంకీర్తన వీనులవిందు చేసేలా రూపొందింది. తెలుగు చలనచిత్రసీమలో అంతకు ముందు, ఆ తరువాత కూడా కొన్ని చిత్రాలలో అన్నమయ్య సంకీర్తనలు సందర్భానుసారంగా చోటు చేసుకుని మురిపించాయి.
మన తెలుగునేలపై జన్మించిన అన్నమయ్య కథను తెరకెక్కించాలని పలువురు ప్రయత్నించారు. ‘మనసు కవి’ ఆచార్య ఆత్రేయ అయితే, అన్నమయ్య కథను స్వీయ దర్శకత్వంలో రూపొందించాలని తపించారు. అందుకోసం నిష్టగా తన ఇంటిపై ఓ కుటీరం వేసుకొని మరీ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఆ కథ కోసం 18 పాటలను కేవీ మహదేవన్ బాణీల్లో రూపొందించారు. అందులో “మంగళం…” అనే సంకీర్తనను గానం చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ పదకవితాపితామహుని రచనను పాడే భాగ్యం కలిగినందుకు ఆనందభాష్పాలు రాల్చారు. ఎందుకనో ఆత్రేయ ప్రయత్నం ఫలించలేదు. ప్రముఖ హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు పద్మనాభం తమ రేఖా అండ్ మురళీ పతాకంపై అన్నమయ్య కథను తెరకెక్కించాలని తపించారు. ఆయన ప్రయత్నం కూడా సఫలీకృతం కాలేదు. ‘ఆనందభైరవి’ వంటి కళాత్మక చిత్రం రూపొందించాక జంధ్యాల మనసు కూడా అన్నమయ్య కథను తెరకెక్కించాలని తపించింది. అందుకోసం రమేశ్ నాయుడు సంగీతంలో ఎనిమిది సంకీర్తనలను ఏసుదాస్, బాలసుబ్రహ్మణ్యంతో పాడించారు. ఆ పాటలు ఆ మధ్య క్యాసెట్ రూపంలో లభించాయి. ఇప్పుడు యూ ట్యూబ్ లో కొన్ని లభించవచ్చు. జంధ్యాల ప్రయత్నం కూడా ఎందుకనో కార్యరూపం దాల్చలేదు.
అన్నమయ్య కథను తెరకెక్కించాలన్న పలువురి ప్రయత్నాలు ఫలించకున్నా, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వి.ఎమ్.సి. దొరస్వామి రాజు చేసిన సంకల్పం నెరవేరింది. నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తూ రూపొందిన ‘అన్నమయ్య’ చిత్రం తెలుగువారిని విశేషంగా అలరించింది. చిత్రమేమిటంటే ఈ సినిమాకు ఆత్రేయ శిష్యుడైన జె.కె.భారవి రచన చేయడం. తన గురువు ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రానికి రచన చేస్తే, తాను వేంకటేశ్వరుని భక్తుడైన అన్నమయ్య కథకు రచన చేశానని గర్వంగా చెప్పుకుంటారు భారవి. అంతకు ముందు అన్నమయ్య కథను తెరకెక్కించాలని జరిగిన ప్రయత్నాల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళం సైతం చోటు సంపాదించింది. అయితే అవి కార్యరూపం దాల్చకపోవడంతో అన్నమయ్య సంకీర్తనలను బాలు గళమాధుర్యంలో తెరపై చూడలేకపోయాం. అయితే అదే బాలుకు అన్నమయ్య చిత్రంలోని ప్రధానగీతాలన్నీ పాడే అవకాశం లభించింది. ఈ చిత్రానికి ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇందులో అనేక అన్నమయ్య సంకీర్తనలను సందర్భానుసారంగా కొన్నిటిని పూర్తిగానూ, మరికొన్నిటిని క్లుప్తంగానూ ఉపయోగించుకున్నారు. ‘అన్నమయ్య’ సినిమా ఆడియో భక్తకోటిని విశేషంగా అలరించింది. ఆ రోజుల్లో ఆడియో అమ్మకాల్లో ‘అన్నమయ్య’ చరిత్ర సృష్టించింది.
‘అన్నమయ్య’ చిత్రాన్ని 1997లో అన్నమయ్య జయంతి అయిన మే 22న విడుదల చేయడం విశేషం. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఈ సినిమాలో అన్నమయ్య జననం సందర్భంలో వేటూరి సుందరరామ్మూర్తి “తెలుగు పదానికి జన్మదినం… ఇది జానపదానికి జ్ఞానపథం… ఏడు స్వరాలే ఏడుకొండలై వెలసిన కలియుగ విష్ణుపథం… అన్నమయ్య జననం…ఇది అన్నమయ్య జననం…” అంటూ పాట పలికించారు. అన్నమయ్య జననాన్ని ‘తెలుగుపదానికి జన్మదినం…’ అంటూ వేటూరి వారు కీర్తించడం సాహితీప్రియులను ఎంతగానో అలరించింది. చిత్రమేమంటే, అన్నమయ్య జననాన్ని అంతలా కీర్తించిన వేటూరి, అన్నమయ్య జయంతి అయిన మే 22న 2010లో తుదిశ్వాస విడిచారు. అలా అన్నమయ్య జయంతి రోజున వేటూరి వర్ధంతి చోటు చేసుకోవడం గమనార్హం! ఇలా తెలుగు సినిమాతో అన్నమయ్య సంకీర్తనల బంధం నాటి నుంచీ సాగుతోంది. భవిష్యత్ లోనూ ఈ ‘సంకీర్తనా చిత్రబంధం’ కొనసాగుతుందనే చెప్పవచ్చు.
