Anil Ravipudi on Jr NTR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉండగా.. అనిల్ ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. భారీ యాక్షన్ సినిమాల మధ్య ఎన్టీఆర్‌తో అనిల్ ఓ ఫ్రెష్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ‘హై’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి సందడి చేశారు. గతంలో తన వద్ద పనిచేసిన ఎస్. కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడంతో ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినిమా గురించి ఏదైనా అప్‌డేట్ ఇస్తారా అని సఫీనా అనే అమ్మాయి అడగడంతో.. అనిల్ తన రెండు చేతులను జేబుల్లో పెట్టుకుని వేదిక దిగి వెళ్లిపోయారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. అయితే యాంకర్ మళ్లీ స్టేజ్‌పైకి రావాలని కోరడంతో.. అనిల్ తిరిగి వేదికపైకి వచ్చారు. అనంతరం స్పందిస్తూ.. ‘మొన్ననే కదా సినిమా అనౌన్స్ అయింది.. చిన్నగా వదులుతా అప్‌డేట్’ అంటూ సరదాగా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

