Site icon NTV Telugu

Sirivennela: మహాకవి కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Sirivennela

Sirivennela

తెలుగు సిని వినీలాకాశంలో వెలిగిన దృవతార సిరివెన్నెల శాస్త్రి. ఒక సభలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు… దర్శకుల ఆలోచనా విధానం, నిర్మాతల లెక్కలు, ప్రేక్షకుల అవగాహనారాహిత్యం లాంటి విషయాల మధ్యలో కూడా ఒక గొప్ప సాహిత్యం ఉన్న పాటని చెప్పాలనే తాపత్రయం సిరివెన్నెల సీతారామశాస్త్రిని మనకి పరిచయం చేసింది. ఎన్నో గొప్ప పాటలని రాసిన సీతారామశాస్త్రి సినిమాల్లో ఉండడం మన అదృష్టం కానీ ఆయన సినిమాలకి మాత్రమే పరిమితం అవ్వడం మన దురదృష్టం. సినిమా తాలూకు కంచేలని తెంచుకోని కవిత్వం వైపు నడిచి ఉంటే సీతారామశాస్త్రి ఆధునిక భారతం చూసిన అతిగొప్ప కవుల్లో ఒకరయ్యేవారు. 30 నవంబర్ 2021లో తుది శ్వాస విడిచారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. కొన్ని కోట్ల మంది సంగీత ప్రియులని ఒంటరిని చేసిన నింగికేగిసాడు ఆ మహాకవి. ఆయన మరణం తెలుగు సినిమా సంగీత ప్రపంచానికి ఎన్ని తరాలు అయినా తీరని లోటుగానే మిగిలిపోతుంది.

ఇదిలా ఉంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. సాగర తీరాన్ని ఆనుకుని ఉన్న ‘వుడా లే అవుట్’ లో స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు.. ప్రభుత్వ అధికారుల కోసం ప్రత్యేకంగా వేసిన వుడా లే అవుట్ లో సిరివెన్నెలకు ఈ స్థలాన్ని కేటాయించారు. కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లాలోనే పుట్టి పెరిగిన సిరివెన్నెల సినిమా రంగంలోకి రావడంతో హైదరాబాద్ లో స్థిరపడ్డారు. కానీ ఆయన బంధు వర్గాల్లో చాలామంది విశాఖ ప్రాంతంలోనే స్థిరపడ్డారు. అందుకే విశాఖపట్నంతో, అనకాపల్లితో సిరివెన్నలకి ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఈ నేథ్యంలో ఆయన జ్ఞాపకార్ధం విశాఖలో స్థలం కేటాయించారు. సిరివెన్నెల ఆనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి ఖర్చులన్ని ప్రభుత్వమే భరించింది. తాజాగా  ఇళ్ల స్థలం కూడా కేటాయించింది. అంతటి గొప్పకవి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిస్థలం కేటాయించడం హర్షించదగ్గ విషయం.

Exit mobile version