తెరపై ‘సూపర్’ అనిపించుకోలేదు కానీ, టాలీవుడ్ సూపర్ స్టార్స్ సినిమాల వేడుకల్లో మాటలతో కోటలు కడుతూ ‘సూపర్’ అనిపించుకుంటూ ఉంటారు సుమ కనకాల. యాంకర్స్ లో సుమ ‘సూపర్ స్టార్’ అనే చెప్పాలి. దాదాపు రెండున్నర దశాబ్దాల నుండీ వ్యాఖ్యాతగా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారామె. సుమ నోట పరుగులు తీసే పదబంధాలు ప్రేక్షకులను పరవశింపచేస్తూ ఉంటాయి. తేనెలూరే తెలుగు ఆమె గళంలో గలగల గోదారిలా ప్రవహిస్తుంది. చిత్రమేమిటంటే- సుమ మాతృభాష తెలుగు కాదు. అయినా తెలుగు భాష ఆమె గాత్రంలో మరింత తీయగా వినిపిస్తూ ఉంటుంది. అందుకే సుమ వ్యాఖ్యానం విన్నాక ‘చిత్రం…భళారే విచిత్రం’ అనకుండా ఉండలేం.
సుమ 1974 మార్చి 22 కేరళలోని పాలక్కాడ్ లో జన్మించారు. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా సికిందరాబాద్ చేరుకున్నారు. సుమ పెరిగి, పెద్దయిందంతా సికిందరాబాద్ లోనే. తరువాత సుమ చిత్రసీమలో రాణించాలనుకున్నారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘కళ్యాణప్రాప్తిరస్తు’లో ఇద్దరు నాయికల్లో ఒకరిగా తెరకు పరిచయమయ్యారు. ఎందువల్లో సినిమాల్లో అంతగా రాణించలేకపోయారామె. అయితే వ్యాఖ్యాతగా తనదైన బాణీ పలికిస్తూ ప్రముఖ శాటిలైట్ ఛానెల్స్ లో పలు కార్యక్రమాలు చేస్తూ సక్సెస్ రూటులో సాగారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా సుమ వ్యాఖ్యానం జనాన్ని అలరిస్తూనే ఉంది. ఇక సినిమాల వేడుకల్లోనూ సుమ యాంకరింగ్ కు ఎంతో క్రేజ్ ఉంది. సుమ వ్యాఖ్యానం చేసిన చిత్రోత్సవాలు ప్రేక్షకులను అలరించడమే కాదు, సదరు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతాయనే సెంటిమెంటూ ఉంది.
ఓ వైపు యాంకర్ గా తనదైన బాణీ పలికిస్తూనే తన దరికి చేరిన పాత్రలలో నటించారామె. అలా “పవిత్రప్రేమ, చాలాబాగుంది, వర్షం, స్వరాభిషేకం, ఢీ, బాద్ షా, ఓ బేబీ” వంటి చిత్రాల్లో నటించారు. గత సంవత్సరం సుమ ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయతీ’ అనే సినిమా రూపొందింది. సుమ భర్త రాజీవ్ కనకాల నటునిగా సాగుతున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి రోషన్ కార్తిక్ కనకాల, కూతురు స్నేహాశ్విని. సుమ కనకాల కొడుకు రోషన్ కార్తిక్ ను హీరోగా పరిచయం చేస్తూ ఇటీవలే ఓ సినిమా మొదలయింది. ఏది ఏమైనా తెలుగునాట ‘సూపర్ యాంకర్’గా సాగుతున్న సుమ మరింతగా అలరిస్తూ సాగాలని ఆశిద్దాం.
