Anchor Anasuya Gives Clarity On Bilkis Bano Tweet: యాంకర్ అనసూయ చేసే వ్యాఖ్యలు గానీ, ట్వీట్లు గానీ నెట్టింట్లో ఒకింత చర్చకు దారి తీస్తుంటాయి. ఆమె దాదాపు వివాదాస్పద అంశాల మీదే ఎక్కువగా స్పందిస్తుంది కాబట్టి.. అది హాట్ టాపిక్‌గా మారిపోతుంది. కొందరు ఆమె చేసే వ్యాఖ్యల్ని సమర్థిస్తే.. మరికొందరు మాత్రం వంకలు వెతుకుతుంటారు. అప్పుడది వివాదంగా మారడం, దానిపై అనసూయ తనదైన క్లారిటీతో కౌంటర్లివ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు తాజాగా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బిల్కిస్ బానో అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో దోషులుగా ఉన్న 11 మంది ఖైదీలను గుజరాత్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే! అయితే.. వాళ్లేదో బార్డర్‌లో యుద్ధం గెలిచిన వీరులుగా కీర్తిస్తూ, ఓ సంస్థ వారిని సన్మానించింది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ రేపిస్టుల్ని ఫ్రీడమ్ ఫైటర్స్‌గా కీర్తించడం నిజంగా దారుణమన్నారు. ఆ ట్వీట్‌ని యాంకర్ అనసూయ రీట్వీట్ చేస్తూ.. ‘ఇది నిజంగా సిగ్గు చేటు. రేపిస్టుల్ని విడిచిపెట్టి, మహిళల్ని ఇంటికే పరిమితం చేసి.. మనం స్వేచ్ఛను పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది’’ అంటూ మండిపడింది.
అనసూయ చేసిన ఆ ట్వీట్‌లో ఎలాంటి తప్పులు లేవు గానీ.. మరో కోణంలో ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు, దానిపై ఎందుకు స్పందించలేదని నెటిజన్లు ఆమెను నిలదీస్తున్నారు. దీంతో అనసూయ తాను చేసిన ట్వీట్లపై స్పష్టత ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘‘నేను ఎవరినో ప్రమోట్ చేసేందుకో లేక డబ్బుల కోసమే ఆ ట్వీట్ చేయలేదు. నా ఆసక్తి మేరకే నా అభిప్రాయాన్ని వెల్లడించాను’’ అని స్పష్టం చేసింది. కొంతమంది చేస్తున్న ఒత్తిడి వల్ల.. చివరికి తాను చేస్తున్న ట్వీట్లపై కూడా ఇలాంటి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.
మరో ట్వీట్.. తాను ఏం ట్వీట్ చేసినా, పూర్తి అవగాహనతోనే చేస్తానని అనసూయ క్లారిటీ ఇచ్చింది. ‘‘మీరు ఏ విషయాలపై అయితే నన్ను మాట్లాడాలని కోరుకుంటారో, వాటి వెనుకుండే నిజానిజాలేంటో ఆ సమయానికి నాకు తెలీదు. కానీ, ఎప్పుడైతే స్పందించాలని అనుకుంటానో, అప్పటికే ఆ విషయం పలచబడిపోతోంది. అప్పుడు నేను నా సొంత అభిప్రాయాన్ని వెల్లడించలేకపోతున్నాను’’ అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. తన ట్వీట్లను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరింది.