EPIC Teaser : ఆసక్తి పెంచేలా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్

Epic Teaser

Epic Teaser

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ చిత్రం ఒక హృద్యమైన అనుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘సంచారమే’ అద్భుతమైన స్పందనను సొంతం చేసుకోగా, తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. ‘ఎపిక్’ టీజర్ అందమైన అనుభూతిని అందిస్తూ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య కథను కేంద్రీకరిస్తుంది. ‘బేబీ’ సినిమా తర్వాత ఈ జంటకు ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ సరికొత్తగా మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది.

90’s వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ సినిమాతో వెండితెరపై అడుగుపెడుతున్నారు. తాజాగా విడుదలైన టీజర్, మొదటి సినిమాతోనే ఆయన ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోబోతున్నారనే నమ్మకాన్ని కలిగిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని తొలి గీతం “సంచారమే” ఇప్పటికే అన్ని ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండ్ అవుతూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇక టీజర్ లోనూ తనదైన నేపథ్య సంగీతంతో మెప్పించారు హేషమ్ అబ్దుల్ వహాబ్.

లండన్ నేపథ్యంతో సాగే ఈ చిత్రం ఒక అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా కనిపిస్తోంది. ఆధునిక సంబంధాలు, ప్రేమలో మారుతున్న భావోద్వేగాలను ఈ సినిమా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రేమకథలో ఆనంద్ దేవరకొండ ఇంట్రోవర్ట్ (అంతర్ముఖుడు) పాత్రలో కనిపిస్తుండగా, వైష్ణవి చైతన్య పూర్తి విరుద్ధంగా ఎక్స్‌ట్రోవర్ట్ (బహిర్ముఖురాలు) పాత్రలో ఆకట్టుకోనున్నారు. విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? వారి ప్రయాణం ఎలా సాగింది? అనేది టీజర్‌లో ఎంతో హృద్యంగా చూపించారు.