NTV Telugu Site icon

Amrish Puri :అంతర్జాతీయంగా అలరించిన అమ్రిష్ పురి!

New Project (61)

New Project (61)

అమ్రిష్ పురి… ఈ పేరు వింటే చాలు సినీ ఫ్యాన్స్ మది పులకించి పోతుంది. ఆయన ఏ భాషలో నటించినా, అక్కడివారిని తన అభినయంతో ఆకట్టుకొనేవారు. అదీ అమ్రిష్ పురి ప్రత్యేకత! తెలుగులోనూ అమ్రిష్ పురి తనదైన బాణీ పలికించిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు?

అమ్రిష్ పురి 1932 జూన్ 22న పంజాబ్ లో జన్మించారు. చిన్నతనం నుంచీ తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచుతూ ఉండేవారు. తన అన్నలు చమన్ పురి, మదన్ పురి హిందీ చిత్రసీమలో రాణిస్తూ ఉన్న సమయంలోనే అమ్రిష్ కూడా ముంబయ్ లో అడుగు పెట్టారు. ఆరంభంలోనే స్క్రీన్ టెస్ట్ లో ఆకర్షించలేకపోయాడు. దాంతో పృథ్వీ థియేటర్స్ లో చేరి సత్యదేవ్ దూబే రాసిన నాటకాల్లో నటిస్తూ ఉండేవారు. నాటకరంగంలో పేరు సంపాదించిన అమ్రిష్ పురికి శ్యామ్ బెనెగల్ చిత్రాలలో మంచి గుర్తింపు లభించింది. అయితే శ్యామ్ సినిమాలన్నీ ప్యారలల్ మూవీస్ కావడంతో అమ్రిష్ కు కమర్షియల్ బ్రేక్ లభించలేదు. అయినా తనకు లభించిన పాత్రలను పోషిస్తూ ఉండేవారు. తెలుగులో విజయం సాధించిన ‘మనవూరి పాండవులు’ ఆధారంగా హిందీలో బాపు రూపొందించిన ‘హమ్ పాంచ్’ చిత్రంలో వీరప్రతాప్ సింగ్ గా నటించి ఆకట్టుకున్నారు అమ్రిష్. ఆ సినిమా తరువాత అనేక కమర్షియల్ మూవీస్ లో నటిస్తూ తనదైన బాణీ పలికించారు. “విధాత, శక్తి, హీరో” వంటి చిత్రాలలో అమ్రిష్ పురి అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఆయన నటన కోసమే సినిమాలకు వెళ్ళే రోజులు ఉండేవి. ఇక ‘మిస్టర్ ఇండియా’లో ముగాంబో పాత్రతో జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు. “త్రిదేవ్, ఘాయల్, దామిని” చిత్రాల్లోనూ అమ్రిష్ విలక్షణమైన పాత్రలు పోషించారు. విలన్ గా భయపెట్టడమే కాదు, “దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, ఫూల్ ఔర్ కాంటే, పర్ దేశ్, విరాసత్, ఘటక్, చీనా గేట్” వంటి చిత్రాలలో పాజిటివ్ రోల్స్ లోనూ అమ్రిష్ పురి అభినయం అలరించింది.

‘ఫలితం దక్కలేదని విచారించకు. ఫలితం చిక్కే దాకా ప్రయత్నిస్తూనే ఉండు’ అన్నదే అమ్రిష్ పురి సిద్ధాంతం. తాను కోరుకున్న సినిమా రంగంలో రాణించడానికి అమ్రిష్ పురి పలు పాట్లు పడ్డారు. చివరకు బాలీవుడ్ ను శాసించే స్థాయికి చేరుకున్నారు. ‘ఆఖరి పోరాటం’, ‘కొండవీటి దొంగ’, ‘జగదేకవీరుడు – అతిలోకసుందరి’, ‘ఆదిత్య 369’, ‘అశ్వమేధం’, ‘నిప్పురవ్వ’, ‘మేజర్ చంద్రకాంత్’ వంటి తెలుగు చిత్రాలలో అలరించారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ నటించిన అమ్రిష్ పురి విఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బెర్గ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియానా జోన్స్ అండ్ ద టెంపుల్ ఆఫ్ ద డూమ్’ చిత్రంలో నటించి అంతర్జాతీయంగానూ పేరు సంపాదించారు. అంతకు ముందు రిచర్డ్ అటెన్ బరో తెరకెక్కించిన ‘గాంధీ’లో ఖాన్ పాత్రలో జీవించీ ఆకట్టుకున్నారు. నున్నటి గుండుతో అనేక చిత్రాలలో నటించిన నటునిగానూ అమ్రిష్ పురి చరిత్ర సృష్టించారు.

తెరపై విలన్ గా ఎంతగానో భయపెట్టిన అమ్రిష్ పురి, నిజజీవితంలో ఎంతో సౌమ్యుడు. శాకాహారి, ప్రకృతి చికిత్సతో సాగేవారు. ఎప్పుడూ శరీరాన్ని గట్టిగా ఉంచుకొనడానికి ప్రయత్నించేవారు. సదా నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. అందుకే ఆయనతో నటించడానికి సహనటీనటులు సైతం ఉత్సాహంతో ఉరకలు వేసేవారు. అలాంటి అమ్రిష్‌ పురి నేడు మన మధ్య లేకపోయినా, ఆయన అభినయం కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ఉన్న అభిమానుల మదిలో సదా నిలచి పోయింది.