బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ స్టార్ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఆయన నటించిన “ఝుండ్” చిత్రం రీసెంట్ గా విడుదల కాగా, సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. మరోవైపు ఈ 79 ఏళ్ల సీనియర్ నటుడు యాక్షన్-ప్యాక్డ్ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఈ యాడ్ లో బిగ్ బీ మూడు గట్టి గాజు పలకలను పగలగొట్టవలసి వచ్చిందట. సాధారణంగా కొంతమంది యంగ్ హీరోలు యాక్షన్ సన్నివేశాల్లో నటించేటప్పుడు డూప్ లను ఉపయోగిస్తుంటారు. అలాంటిది అమితాబ్ మాత్రం తానే స్వయంగా స్టంట్స్ చేస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
Read Also : Sunitha Boya: తప్పుడు ఆరోపణలు నమ్మొద్దు: నిర్మాత బన్నీ వాస్ ప్రతినిధి
ఈ విషయాన్ని సదరు యాడ్ ను తెరకెక్కించిన యాక్షన్ డైరెక్టర్ మనోహర్ వర్మ వెల్లడించారు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో “ఈ యాక్షన్ సీక్వెన్స్ ను స్వయంగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు అమితాబ్ వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని మరోసారి నిరూపించారు. మేము కూడా సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాము” అని చెప్పుకొచ్చారు. కాగా అమితాబ్ బచ్చన్ ఇప్పుడు “రన్‌వే 34″లో కీలకపాత్రలో నటిస్తున్నారు. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న సినిమా విడుదల కానుంది.