Ameer Log: ఆర్కిటెక్ట్ నుంచి డైరెక్టర్‌.. కీరవాణి పాడిన పాట హైలైట్‌!

Ameer Log News

Ameer Log News

‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో తెరకెక్కిన సరికొత్త నేటివిటీ చిత్రం ‘అమీర్ లోగ్’. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పణలో ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ఆగస్ట్ 21న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ మీడియాతో ముచ్చటించి సినిమా జర్నీ, మేకింగ్ విశేషాలను పంచుకున్నారు.

 రమణా రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా రాఘవపురం. హైదరాబాద్ జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ పూర్తి చేసి, దాదాపు 20 ఏళ్లు ఆర్కిటెక్ట్‌గా రాణించారు. లాక్‌డౌన్ సమయంలో కథలు రాయడంపై దృష్టి పెట్టి, స్నేహితుల ప్రోత్సాహంతో సినీ ప్రయాణం మొదలుపెట్టారు రమణా రెడ్డి. నటుడు మనోజ్ బాజ్‌పేయి ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ‘అమీర్ లోగ్’ అనే పదం నుంచే ఈ కథా ఆలోచన పుట్టింది. ఒక బస్తీ, ముగ్గురు కుర్రాళ్ల జీవన విధానం చుట్టూ హైదరాబాద్ నేటివిటీని ప్రతిబింబించేలా రెండేళ్ల పాటు పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేశారు రమణా రెడ్డి. సెట్స్‌లో ఆర్టిస్టుల సహజమైన ఎమోషన్స్, బస్తీ వాతావరణం స్క్రీన్‌పై పర్ఫెక్ట్‌గా పండాలనే ఉద్దేశంతోనే డబ్బింగ్ కాకుండా సింక్ సౌండ్‌లో చిత్రీకరించారు. డెమోతో కలిపి దాదాపు 43 రోజుల్లో (బస్తీలోనే 38 రోజులు) షూటింగ్ పూర్తి చేశారు. సినిమా రషెస్ చూసిన రానా దగ్గుబాటి బృందం కథలోని సహజత్వానికి ఫిదా అయి చిత్రానికి పూర్తి అండగా నిలిచారు.

 సాధారణంగా నగరంలో ప్రజలు మాట్లాడుకునే సహజమైన తెలుగు, ఉర్దూ పదాల కలయికతోనే సంభాషణలు ఉంటాయి. ఎమోషన్ బలంగా ఉండటంతో ప్రతి ఒక్కరికీ కథ సులభంగా అర్థమవుతుంది.  చిత్రంలో మొత్తం 10 పాటలు ఉంటాయి. ఇందులో ఎం.ఎం. కీరవాణి పాడిన పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, తరతరాలు గుర్తుండిపోతుందని దర్శకుడు తెలిపారు. సీనియర్ దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ చిత్రాన్ని బాలీవుడ్ హిట్స్ ‘ఝుండ్’, ‘గల్లీబాయ్’లతో పోల్చి అభినందించారు. సెన్సార్ బోర్డు నుంచి కూడా కేవలం కొన్ని మ్యూట్‌లతో సినిమా క్లియర్ అయిందని, ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని రమణా రెడ్డి స్పష్టం చేశారు.