ప్రముఖ కథానాయిక అమలాపాల్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఆమె తాజా చిత్రం ‘కడవెర్’ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విశేషం ఏమంటే… ఈ సినిమాకు అమలాపాల్ నిర్మాత కూడా! తాను చిత్రసీమలోకి అడుగు పెట్టి 12 సంవత్సరాలు అయ్యిందని అమలాపాల్ తెలిపింది. ’12 యేళ్ళు, 144 నెలలు, 4380 రోజులను ఈ రంగంలో పూర్తి చేశాను. ఇదో గొప్ప అనుభూతి. ఈ అనుభవంతో మరింతగా చిత్రసీమలోకి విస్తరించడానికి నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాను’ అని అమలాపాల్ చెప్పింది. అయితే అమలాపాల్ నిర్మిస్తున్న ‘కడవెర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను అనూప్ ఫణిక్కర్, అభిలాష్ పిళ్ళై సంయుక్తంగా తెరకెక్కించారు.
Read Also : ‘ఐకాన్’ మళ్ళీ ఆగనుందా!?
కేరళకి చెందిన మాజీ పోలీస్ సర్జన్ డాక్టర్ బి. ఉమాదథన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘కడవెర్’ సినిమాను రూపొందించారు. ఇందులో తమిళనాడు చీఫ్ పోలీస్ సర్జన్ డాక్టర్ భద్ర పాత్రను అమలాపాల్ పోషిస్తోంది. ఇతర ప్రధాన పాత్రలలో హరీశ్ ఉత్తమన్, రమేశ్ ఖన్నా, వినోద్ ఇన్బరాజ్ కనిపించబోతున్నారు. ఈ సినిమాను దర్శక నిర్మాతలు ఇండియాస్ ఫస్ట్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా పేర్కొంటున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అరవింద్ సింగ్ సినిమాటోగ్రాఫర్. గత కొంతకాలంగా నటిగా కొత్తదనం కోసం తాపత్రయ పడుతున్న అమలాపాల్ వ్యక్తిగత జీవితంలోనూ చేదు అనుభవాలను ఎదుర్కొంది. అయితే వాటిని అధిగమించి, ఇప్పుడిప్పుడే తిరిగి నటన, చిత్ర నిర్మాణంపై దృష్టి పెడుతోంది. త్వరలో థియేటర్లలో సందడి చేయనున్న ‘కడవెర్’ అమలాపాల్ కు నటిగా, నిర్మాతగా ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.
