NTV Telugu Site icon

అలీ ఆవిష్కరించిన ‘అల్లంత దూరాన’ టీజర్

allantha doorana

allantha doorana

విశ్వ కార్తికేయ హీరోగా, సీనియర్ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ హీరోయిన్ గా చలపతి పువ్వల దర్శకత్వంలో ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్న చిత్రం ‘అల్లంత దూరాన’. ఈ చిత్ర నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రసాద్ ల్యాబ్ లో మూవీ టీజర్ ను హాస్యనటుడు అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ, ”కధకు తగ్గట్టుగా ఆర్టిస్టులను ఎంపిక చేసుకుని ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. కేరళలో కొన్ని సీన్స్, పాటలు తీసేటప్పుడు ఎత్తైన కొండల అంచులపైకి ఎక్కి టీమ్ చాలా రిస్క్ చేసింది. ఇందులో నటించిన నటుడిగా తప్పకుండా ఇదో మంచి చిత్రమవుతుందని చెప్పగలను” అని అన్నారు.

చిత్ర దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ, ”స్క్రిప్ట్ పరంగా పేపర్ మీద ఏదైతే పెట్టానో, దానిని నమ్మి, నిర్మాత చంద్రమోహన్ రెడ్డి, సినిమాకు కావాల్సిన ఆర్టిస్టులు భాగ్యరాజా, ఆమని, తులసి వంటి వారిని సమకూర్చడమే కాదు, మంచి సాంకేతిక నిపుణలను ఎంపిక చేసుకునే విషయంలో కూడా నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. దానివల్లే నేను అనుకున్నవిధంగా విజువల్ ఫీస్ట్ చిత్రాన్ని తెరకెక్కించగలిగాను. ప్రతీ సన్నివేశం, ప్రతీ పాట ప్రేక్షకులను లీనమయ్యేలా చేస్తుంది’ అని అన్నారు. నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ, ”మంచి కథ, కథనాలే ఈ చిత్రాన్ని తీసేందుకు నాకు స్ఫూర్తి కలిగించాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందించిన ఈ చిత్రం రెండు బాషలలో మా అంచనాలను నిలబెడుతుందన్న నమ్మకం ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, మోషన్ పోస్టర్లకు ఎనలేని స్పందన లభించింది” అని చెప్పారు. అన్నారు. గీత రచయిత రాంబాబు మాట్లాడుతూ, ‘ఇందులోని ఐదు పాటలు వేటికవే విభిన్నంగా ఉంటాయని, అన్ని పాటలను తానే రాశాన’ని చెప్పారు. హీరోయిన్ హ్రితిక శ్రీనివాసన్ మాట్లాడుతూ, ”తెలుగులో నా మొదటి చిత్రమిది. ఇలాంటి ఫీల్ గుడ్ చిత్రంలో నటించే అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది. మా ఆంటీ ఆమనిలా మంచి నటిని అనిపించుకోవాలని ఉంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, నిర్మాతలు డి. ఎస్.రావు, బెక్కం వేణుగోపాలరావు, శ్రీనివాస్, నటుడు కాశీ విశ్వనాద్ తదితరులు పాల్గొన్నారు.

YouTube video player