Alia Bhatt: ఇప్పుడు ఎక్కడ చూసినా భారతీయ సినీ అభిమానులు ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” పాట గురించే చర్చించుకుంటున్నారు. తెలుగు సినిమాలకు ఆస్కార్ అసాధ్యం అనుకున్నది “నాటు నాటు…” పాట సుసాధ్యం చేసింది. దాంతో ఆ పాటను స్వరపరచిన కీరవాణి, రాసిన చంద్రబోస్ విజేతలుగా ఆస్కార్ ను అందుకున్నారు. కానీ, వారికన్నా మిన్నగా ఆ చిత్రానికి పనిచేసిన వారందరూ ఆనందిస్తున్నారు. అంతెందుకు, ఆ వేడుకలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న దీపికా పదుకొణే అవార్డు ప్రకటించగానే ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంది. ఇక ఆ చిత్రంలో నటించిన వారి సంగతి వేరే చెప్పాలా!? ‘ట్రిపుల్ ఆర్’లో సీత పాత్రలో నటించి, తెలుగువారి అభిమానం పొందిన అలియా భట్ ఈ మధ్యే తల్లి అయింది. లేకపోతే, ఆమె కూడా చిత్రబృందంతో పాటు పాలుపంచుకొనేవారేమో! బాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకరైన రణబీర్ కపూర్ భార్య కాకముందే అభినేత్రిగా అలియా భట్ తనదైన బాణీ పలికించారు. తన అందచందాలతో యువతను మరింతగా ఆకట్టుకున్నారు. అలియాకు పెళ్ళయిపోయినా, ఇప్పటికీ ఆమె కొందరు అభిమానులకు హార్ట్ బీట్ అనే చెప్పాలి.
అలియా భట్ 1993 మార్చి 15న జన్మించారు. ఆమె తండ్రి మహేశ్ భట్ ప్రముఖ దర్శకులు. తల్లి సోనీ రజ్దాన్ ప్రముఖ నటి. వారి జీన్స్ కారణంగానే అలియా మనసు సైతం చిన్నతనంలోనే సినిమా రంగంవైపు పరుగులు తీసింది. ఆరేళ్ళ ప్రాయంలోనే తండ్రి రూపొందించిన ‘సంఘర్ష్’లో నటించింది అలియా. ముంబైలోని జమ్నాబాయి నర్సీ స్కూల్ లో ట్వల్త్ గ్రేడ్ వరకూ చదివాక, అలియా సినిమారంగంలో రాణించాలని నిర్ణయించుకుంది. సంజయ్ లీలా భన్సాలీ ‘బాలికా వధూ’ అనే చిత్రాన్ని రూపొందించాలని భావించి, అందులో 12 ఏళ్ళ అలియాను నాయికగా ఎంచుకున్నారు. ఆ సినిమాలో 20 ఏళ్ళ రణబీర్ ను కథానాయకుడనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమా అటకెక్కింది. 2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో నాయికగా పరిచయమైంది అలియా భట్. “షాన్ దార్, డియర్ జిందగీ, బద్రీనాథ్ కీ దుల్హనియా, రాజి, గల్లీ బాయ్, గంగూబాయ్ కథియవాడియా, ట్రిపుల్ ఆర్” వంటి చిత్రాలలో మురిపించారు అలియా. రణబీర్ కపూర్ తో కలసి ఆమె నటించిన ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1-శివ’ గత సంవత్సరమే విడుదలయింది. అలియా నిర్మాణ భాగస్వామిగా రూపొందిన ‘డార్లింగ్స్’ కూడా నిరుడు వెలుగు చూసింది. ప్రస్తుతం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లోనూ, ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే ఆంగ్ల చిత్రంలోనూ అలియా నటిస్తున్నారు.
చిత్రమేంటో కానీ, ‘బాలికా వధూ’లో రణబీర్ కపూర్ తో జోడీ కట్టవలసిన అలియా భట్ తరువాత అతని నిజజీవిత భాగస్వామి కావడం విశేషం! గత సంవత్సరం ఏప్రిల్ 14న రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్న అలియా భట్ నవంబర్ లోనే ఓ పాపకు జన్మనిచ్చారు. పాప పేరు రహా. ప్రస్తుతం ముంబైలోనే భర్తతో కలసి ఉంటున్న అలియా భట్ కు లండన్ లోనూ ఓ ఇల్లు ఉంది. అలియా భట్ రాబోయే చిత్రాలతో ఏ తీరున మురిపిస్తారో చూడాలి.