తమిళంలో ఘనవిజయం సాధించిన ‘విక్రమ్ వేద’ ఆధారంగా ఓ హిందీ చిత్రం అదే టైటిల్ తో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే! ఈ హిందీ చిత్రంలో వేదగా హృతిక్ రోషన్, విక్రమ్ గా సైఫ్ అలీఖాన్ నటించారు. 2017లో విడుదలైన ‘విక్రమ్ వేద’ చిత్రాన్ని తెరకెక్కించిన పుష్కర్-గాయత్రి హిందీ చిత్రాన్ని సైతం రూపొందించారు. ఈ చిత్రంలోని “ఆల్కాహోలియా…” అంటూ సాగే పాట శనివారం యూ ట్యూబ్ లో జనం ముందు నిలచింది. మద్యాన్ని నెత్తిన పోసుకొని హృతిక్ రోషన్ చిందులేస్తూ రూపొందిన ఈ పాటకు హోలీ నేపథ్యంగా భావించవచ్చు. అందుకనే “ఆల్కాహోలియా…” అంటూ పాట సాగుతుంది. ఎప్పటిలాగే హృతిక్ రోషన్ తనదైన డాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకొనేలా ఈ పాట తెరకెక్కింది. ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
“ఆల్కాహోలియా…” అంటూ సాగే పాటను మనోజ్ ముంటాషిర్ రాయగా, విశాల్- శేఖర్ సంగీతం సమకూర్చారు. స్నిగ్ధజిత్ భౌమిక్, అనన్య చక్రబర్తితో కలసి సంగీత దర్శకులు విశాల్-శేఖర్ ఈ పాటను పాడారు. పాట అలా రిలీజ్ అయిందో లేదో వీక్షకులు విశేషంగా తిలకిస్తున్నారు. సర్రుమంటూ వ్యూయర్స్ సంఖ్య పెరిగిపోతోంది. తమిళంలో గ్రాండ్ సక్సెస్ చూసిన ‘విక్రమ్ వేద’ హిందీలో ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో సెప్టెంబర్ 30న తేలిపోనుంది.
