నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన “అఖండ” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి సీనియర్ హీరోలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేసిన ‘అఖండ’ నందమూరి అభిమానులకు మాస్ ఫీస్ట్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు నందమూరి అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు.
Read Also : కరోనా నుంచి కోలుకున్న కమల్
‘అఖండ’ హై ఓల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ అని, అఘోర గా బాలయ్య అదరగొట్టేశాడనీ, యాక్షన్ అండ్ బిజియం సినిమాకు టాప్ హైలెట్స్ అని, హీరోయిన్ సన్నివేశాలు బోరింగ్ గా ఉన్నప్పటికీ, సినిమా మాస్ ను ఇష్టపడే వ్యక్తులకు ఫీస్ట్ అవుతుందని, ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతమని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ కు ఇక మాస్ జాతర అంటూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు.
ప్రథమార్థం యావరేజ్ గా ఉందని, సెకండ్ హాఫ్ మాస్ ఫీస్ట్ అని, బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని, ప్రీ ఇంటర్వెల్ నుంచి మూవీ ఊపందుకుంటుంది అని అంటున్నారు. శ్రీకాంత్, బాలయ్య మధ్య వచ్చే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ గగుర్పాటుకు గురి చేస్తాయట. ఇక బాలయ్య నట విశ్వరూపం చూపించగా, ప్రగ్యా తన పాత్రలో పర్వాలేదనిపించింది. శ్రీకాంత్ కు పవర్ ఫుల్ రోల్ దక్కింది. బోయపాటి బాలయ్యను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడంలో, అభిమానులకు మాస్ స్టఫ్ అందించడంలో సక్సెస్ అయ్యాడు. తమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. తెరపై మ్యాజిక్ చేసింది. అయితే కథ రాసుకున్న తీరు, హీరోయిన్ సినిమాకు మైనస్ పాయింట్స్ అంటున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా బాగున్నాయని సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
మొత్తానికి బాలయ్య, బోయపాటి కలిసి మరో గోల్డెన్ హిట్ ను సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే బాలయ్య కెరీర్లోనే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి సినిమాకు మౌత్ టాక్ అదిరిపోయింది. రివ్యూలు కూడా పాజిటివ్ గానే రావడంతో సాధారణ ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెరిగింది. వీకెండ్ లోపు ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉంటుంది. ఇక చివరి సినిమాతో దారుణమైన పరాజయాన్ని చవి చూసిన బోయపాటికి ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చింది.
