నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం సంచలన విజయం సాధించి, పలు రికార్డులను నమోదు చేసుకుంది. ఈ సినిమా విడుదలయ్యాక పలు క్రేజీ ప్రాజెక్ట్స్ జనం ముందు నిలచినా, `అఖండ` మాత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండడం మరింత విశేషం. ఈ చిత్రంతో వరుసగా బాలయ్యతో మూడు సినిమాలు తీసి ఘనవిజయం సాధించి, డైరెక్టర్ బోయపాటి శ్రీను `హ్యాట్రిక్` సొంతం చేసుకున్నారు. ఇక ఈ మూడు చిత్రాలలోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం తెలిసిందే! ఈ కోణంలోనూ బాలయ్య- బోయపాటి కాంబో మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం ప్రస్తుతం చిలకలూరి పేటలో డైరెక్ట్ గా ప్రదర్శితమవుతూ ఉంది. అక్కడ గనక ఈ సినిమా రజతోత్సవం పూర్తి చేసుకుంటే, వరుసగా ఓ హీరోతో ఓ డైరెక్టర్ మూడు సిల్వర్ జూబ్లీస్ (అదీ రోజూ 4 ఆటలతో) చూసిన ఘనత సొంతమవుతుంది. ఈ రికార్డుల పర్వం ఇలా ఉండగా, ఈ చిత్రం ఓటీటీలోనూ ఇతర భాషా చిత్రాల కన్నా మిన్నగా స్ట్రీమింగ్ లో `నంబర్ వన్`గా నిలచింది. ఇక శాటిలైట్ ద్వారా కూడా మరో రికార్డును `అఖండ` సొంతం చేసుకోవడం విశేషం!
`అఖండ` చిత్రం జనవరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలయింది. అప్పటి నుంచీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయిన దక్షిణాది నాలుగు భాషా చిత్రాల్లో `అఖండ` నంబర్ వన్ గా నిలచింది. ఇక ఏప్రిల్ 10వ తేదీ ఆదివారం `అఖండ` మా టీవీలో వరల్డ్ ప్రీమియర్ గా ప్రసారమైంది. ఇక్కడా `అఖండ` అరుదైన రికార్డు నమోదు చేసుకుంది. SD and HD రెండింటా `అఖండ` రికార్డ్ స్థాయిలో TRP సాధించినట్టు తెలుస్తోంది. `స్టాండర్డ్ డెఫినిషన్`లో 23.2 రేటింగ్ సంపాదించిన ఈ చిత్రం హై డెఫినిషన్ లో 25.3 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇలారెండు ఫార్మాట్ల్స్ లోనూ ఈ స్థాయి రేటింగ్ సంపాదించిన తెలుగు చిత్రంగానూ `అఖండ` రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తామని ఆ మధ్య చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. బిగ్ స్క్రీన్, ఓటీటీ, టీవీ మూడు చోట్లా ఏదో ఒక రికార్డును సొంతం చేసుకున్న `అఖండ` సీక్వెల్ చూడాలని జనం ఉవ్విళ్లూరుతున్నారు. మరి అది ఏ నాడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.