Golmaal 5 Release Date: బాలీవుడ్‌లో కొన్ని కామెడీ ఫ్రాంచైజీలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో ‘గోల్‌మాల్’ సిరీస్ కూడా ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే నాలుగు భాగాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు ఐదో సినిమా రాబోతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘గోల్‌మాల్ 5’ (Golmaal 5) రిలీజ్ డేట్ వచ్చేసింది. కొత్త సంవత్సరం కానుకగా ఈ క్రేజీ చిత్రాన్ని 2027 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఈ రోజు (సెప్టెంబర్ 19) ఒక అదిరిపోయే మోషన్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
ఈ ఐదవ భాగంలో పాత గోల్‌మాల్ గ్యాంగ్ అంతా మళ్లీ కలిసి హంగామా చేయబోతోంది. అజయ్ దేవగన్‌తో పాటు అర్షద్ వార్సి, శ్రేయాస్ తలపడే, కునాల్ ఖేము, తుషార్ కపూర్ నవ్వులు పూయించడానికి రెడీ అయ్యారు. అయితే ఈసారి ఫ్యాన్స్‌కు డబుల్ థ్రిల్ ఇస్తూ, మొదటి భాగంలో నటించిన శర్మాన్ జోషి చాలా కాలం తర్వాత మళ్లీ ఈ ఫ్రాంచైజీలోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. వీరందరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో ఈ సారి విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ సరికొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇప్పటివరకు వచ్చిన నాలుగు గోల్‌మాల్ సినిమాలు ఒక్కో భాగంలో ఒక్కో కొత్త ఎలిమెంట్‌ను తీసుకొచ్చాయి. మొదటి సినిమా కామెడీతో సూపర్‌హిట్ కాగా, రెండో భాగంలో కరీనా కపూర్‌తో సీరియల్ డ్రామా నేపథ్యాన్ని జోడించారు. మూడో భాగంలో గోపాల్, మాధవ్, లక్ష్మణ్ త్రల మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి. నాలుగో భాగంలో రోహిత్ శెట్టి కామెడీకి హారర్‌ను జోడించి కొత్త ప్రయోగం చేశారు. ఇప్పుడు ‘గోల్‌మాల్ 5’ లో రోహిత్ శెట్టి ఎలాంటి కొత్త కాన్సెప్ట్‌ను తీసుకురాబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, శర్మన్ జోషి వంటి పాత ఫేవరెట్‌లతో పాటు అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇవ్వడంతో ఈసారి గోల్‌మాల్ గ్యాంగ్ మరింత రచ్చ చేసేలా కనిపిస్తోంది. ఇక అజయ్ దేవగన్‌కు 2026, 2027లో వరుస సినిమాలు ఉండగా, దృశ్యం 3పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి గోల్‌మాల్ 5 మాత్రం 2027 సంక్రాంతి సీజన్‌లో నవ్వుల సందడి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

