ఇవాళ ఓటీటీలతో తమిళ టెలివిజన్ సంస్థలు పోటీ పడుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ కాని చిత్రాలను ఓటీటీతో పోటీగా శాటిలైట్ హక్కులు పొంది, తమ ఛానెల్స్ లో ప్రసారం చేస్తున్నాయి. అలా… ఐశ్వర్య రాజేశ్ నటించిన ఎకో హారర్ థ్రిల్లర్ ‘భూమిక’ తమిళ చిత్ర ప్రసార హక్కులను విజయ్ టీవీ పొందింది. ఆగస్ట్ 22న ఈ సినిమాను ప్రసారం చేయబోతోంది. విశేషం ఏమంటే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ 23వ తేదీ దీనిని స్ట్రీమింగ్ చేయబోతోంది. నెట్ ఫ్లిక్స్ తన చిత్రాలను వివిధ భాషల్లోకి అనువదించి స్ట్రీమింగ్ చేస్తుంటుంది. ఆ రకంగా ‘భూమిక’ను తెలుగులో డబ్ చేసింది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు విడులైంది. నెట్ ఫ్లిక్స్ సౌత్ లో పోస్ట్ చేసిన ఈ తెలుగు ట్రైలర్ ను ఐశ్వర్యా రాజేశ్ రీ ట్వీట్ చేసింది.
‘మనిషి అవసరానికి ప్రకృతిని వాడుకుంటున్నాడు. అదే ప్రకృతి తిరగబడితే?’ ఇదే అంశంపై ‘భూమిక’ చిత్రం రూపుదిద్దుకుంది. నీలగిరి అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రకృతిని నాశనం చేయడం, అడవులను ఆక్రమించుకోవడం వల్ల జరిగే దుష్పరిణామాలను దర్శకుడు రతీంద్రన్ ఆర్ ప్రసాద్ చూపించినట్టు ఈ ట్రైలర్ బట్టి అర్థమౌతోంది. అయితే… కేవలం సామాజిక కోణంలోనే కాకుండా దీన్ని హారర్ జానర్ లో తెరకెక్కించారు. దాంతో ఈ మూవీపై ఆసక్తి మరింతగా పెరిగే ఆస్కారం ఏర్పడింది. కానీ తెలుగు ట్రైలర్ లో డబ్బింగ్, పాటల సాహిత్యం ఏమంత గొప్పగా లేవు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి! స్టోన్ బెంచ్ ఫిల్మ్ పతాకంపై కార్తికేయన్ సంతానం, సుందరం, జయరామన్ నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ‘భూమిక’ చిత్రానికి ఇటాలియన్ సినిమాటోగ్రఫర్ రాబర్టో జజ్జర వర్క్ చేయడం విశేషం.